Hud Hud Cyclone: హుద్ హుద్ విలయానికి నేటితో 8 ఏళ్ళు, ఒళ్లు గగుర్పొడిచేలా ఆ కాళరాత్రి జ్ఞాపకాలు
విలయాన్ని సృష్టించిన హుద్ హుద్ తుఫాన్ వచ్చి నేటికి (అక్టోబర్ 14) సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తయింది.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. ఇంకా పూర్తిగా ఖరారు కాని రాజధాని ఏపీ లోని ప్రజలందరి దృష్టి వీటి వైపే చూస్తున్న సమయంలో ముంచుకువచ్చిన ప్రకృతి ప్రళయం హుద్ హుద్ తుఫాన్. గంటకు 220 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖను చిగురుటాకులా వణికించాయి. దాదాపు 5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. తుపాను సందర్బంగా గాలులు ఎంత బలంగా వీచాయంటే షో రూముల్లో నుండి కొత్త కార్లు రోడ్డు పైకి వచ్చి పడిపోతున్న దృశ్యాలు ఇంకా విశాఖ ప్రజల కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అంతటి విలయాన్ని సృష్టించిన హుద్ హుద్ తుఫాన్ వచ్చి నేటికి (అక్టోబర్ 14) సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తయింది. రాష్ట్ర సీఎం స్వయంగా విశాఖ వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడం, దేశ ప్రధాని వచ్చి విశాఖ కలెక్టర్ ఆఫీసులో కూర్చుని రివ్యూ మీటింగ్ పెట్టడం వంటి ఘటనలను వైజాగ్ వాసులు ఇంకా మర్చిపోలేదు.
2014 అక్టోబర్ 9 న తోలి హెచ్చరిక:
హుద్ హుద్ గమనాన్ని తీవ్రతను గమనించిన తుపాను హెచ్చరికల కేంద్రం అక్టోబర్ 8 వ తేదీనే దాని పరిధి సుమారు 500 కిలో మీటర్లు ఉండవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలను ముందస్తుగానే హెచ్చరించింది. ముందుగా ఒడిశాలో తీరం దాటొచ్చని భావించారు. అయితే అది దిశను మార్చుకుని విశాఖ వద్ద తీరం దాటింది. అక్టోబర్ 13,14 తారీఖుల్లో వైజాగ్ వద్ద గల పూడిమడక వద్ద తీరం దాటింది. అయితే, తుపాను తీవ్రతను ముందుగానే అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే, ఎంతమంది చనిపోయారు అనేదానిపై ఇప్పటికీ అనేక అంచనాలు ఉన్నాయి. 24 మంది చనిపోయినట్టు అధికారులు చెబితే.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రవేటు నివేదికలు తెలిపాయి.
వేల కోట్లలో ఆస్తినష్టం
హుద్ హుద్ తుపాను సందర్బంగా జరిగిన ఆస్తినష్టం అంతకు ముందు ఏపీ ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ఆనాటి లెక్కల ప్రకారం 1. 63 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది అని చెబుతారు. ఆంధ్ర ప్రదేశ్ సహా ఒడిశా, అండమాన్ అండ్ నికోబర్ ద్వీపాలు ఈ తుపాను ధాటికి దెబ్బ తిన్నాయి.
రెండు విడతలుగా వచ్చిన హుద్ హుద్
హుద్ హుద్ తుపాను అనేది ఒకదాని వెంట మరొకటి గా వచ్చిన రెండు తుపానులు అని చెప్పాలి అంటారు. ఎందుకంటే వైజాగ్ పై దాని ప్రభావం రెండు భాగాలుగా పడింది. మొదట అక్టోబర్ 13 రాత్రి 8-12 గంటల సమయంలో ప్రచండమైన గాలులతో విధ్వసం సృష్టించింది. దీనివల్ల తీర ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే 12 గంటలు గ్యాప్ తీసుకుని మరోసారి భారీ వర్షం తో తుపాను విరుచుకుపడింది. దీనివల్ల జనావాసాలు దెబ్బ తినడంతోపాటు,సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. వైజాగ్ లో ముగ్గురు చనిపోయినట్టు తెలిపారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి విశాఖ సహా,తూర్పుగోదావరి ,విజయ నగరం,శ్రీకాకుళం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. రోడ్లు పాడైపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా,కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. NDRF నుండి 240 మంది,ఆర్మీ నుండి 240 మంది సైనికులు,నేవీ నుండి 120 ,గజ ఈతగాళ్లు 270 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒక్క విశాఖ లోనే 139 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైంది.
దెబ్బతిన్న పరిశ్రమలు
విశాఖ లోని చాలా ఇండస్ట్రీలు హుద్ హుద్ బారిన పడ్డాయి. స్టీల్ ప్లాంట్ లో పని నిలిచిపోవడం తో పాటు,వైజాగ్ పోర్ట్, గంగవరం పోర్ట్,షిప్ యార్డ్ లు దెబ్బతిన్నాయి. సరుకు రవాణా తాత్కాలికంగా నిలిచిపోయింది. వైజాగ్ లో 144, విజయనగరం లో 83 ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లు విధ్వంసం పాలయ్యాయి. కేవలం పరిశ్రమలకే 1000 కోట్లు నష్టం వాటిల్లింది అని లెక్కలు చెబుతున్నాయి.
వైజాగ్ లోనే మకాం వేసిన సీఎం -1000 కోట్లు సహాయం ప్రకటించిన ప్రధాని
తుపాను వల్ల కలిగిన నష్టం ఎలా ఉందో గమనించిన నాటి సీఎం చంద్రబాబు వైజాగ్ లోనే మకాం వేసి సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. సీఎం వచ్చి క్షేత్ర స్థాయిలో పాల్గొనడం తో అధికారులు,సిబ్బంది నిద్రాహారాలు లేకుండా కష్టించి మూడు రోజుల్లోనే జనజీవనానికి ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే దేశ ప్రధాని మోదీ కూడా విశాఖలో పర్యటించి,కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ పెట్టి పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించారు.
విలయాన్ని తట్టుకుని నిలిచిన విశాఖ
హుద్ హుద్ లాంటి కేటగిరీ 4 స్థాయి తీవ్ర తుపాను ధాటికి దెబ్బతిన్న విశాఖ మళ్ళీ కోలుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది అని కొందరు భయపడినా ఇక్కడి ప్రజల మనోధైర్యంతో వైజాగ్ మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాల్లోనే పూర్వ స్థితికి చేరింది. అయితే,నాటి విలయ తాండవాన్ని గుర్తు చేస్తే మాత్రం వైజాగ్ వాసుల మదిలో ఆ కాళరాత్రి పుట్టించిన భయాలు మళ్లీ మెదులుతుంటాయి.