Alert In Vizag: సికింద్రాబాద్ ఘటనతో వైజాగ్‌లో హై అలెర్ట్
వైజాగ్ రైల్వే స్టేషన్ వద్ద సెక్యూరిటీని నాలుగింతలు పెంచారు. వివిధ దళాలకు చెందిన 100 మందికిపైగా బలగాలతో పహారా కాస్తున్నారు.
సికింద్రాబాద్ అల్లర్ల వేడి విశాఖకు తాకింది. వైజాగ్ రైల్వే స్టేషన్ చుట్టూ కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను పెంచారు అధికారులు. శుక్రవారం ఉదయం నుంచి విశాఖలో వాతావరణం ప్రశాంతంగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికి నిఘావర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు భద్రతను పెంచారు. జనరల్ పోలీసులకు తోడుగా, జీఆర్ఫీ, RPFలాంటి దళాలకు చెందిన బలగాలను స్టేషన్ చుట్టూ మోహరించారు.
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌కు ఉన్న 5 ప్రధాన మార్గాల వద్ద సెక్యూరిటీని పెంచారు. ఇటు సిరిపురం, అల్లిపురం వైపు ఉన్న గేట్లకు తోడు పోర్ట్ ట్రస్ట్, జ్ఞానాపురం మార్గాల వద్ద కూడా పోలీసులు మోహరించారు. ఇక ముందు జాగ్రత్తగా మహిళా పోలీసులను షీల్డ్స్ తో సహా రంగంలోకి దించారు.
శనివారం నాడు విశాఖలో కాస్త అలజడి రేగే అవకాశం ఉందంటూ నిఘావర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు వైజాగ్ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, డీసీపీ సుమిత్ స్వయంగా రైల్వే స్టేషన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దక్షిణ భారత రైల్వే ముఖ ద్వారంగా చెప్పే విశాఖ స్టేషన్ ద్వారానే రోజూ వేల మంది ఒడిశా, బీహార్, బెంగాల్ రాష్ట్రాల నుంచి పనుల కోసం దక్షిణాదికి ప్రయాణిస్తుంటారు. అందుకే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఈస్ట్ కోస్ట్ నుంచి సౌత్‌కి ఉన్న మార్గం తెగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు తమ పూర్తి నిఘాను విశాఖపై పెట్టారు. పైగా విశాఖలో కాలేజీలు, విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. వారిలో అనేక మంది పోటీ పరీక్షలకు, ఆర్మీ ఉద్యోగాలకు రెడీ అవుతుంటారు. అలాంటి చోట ఎలాంటి ఇబ్బందికర ఘటనలూ జరగకుండా పోలీసులూ అధికారులూ పూర్తి సన్నద్ధతతో ఉన్నారు.
రైల్వే ఆస్తులను పాడు చెయ్యవద్దు : వాల్తేర్ డివిజన్ DRM అనూప్ సత్పతీ
దేశంలో అనేక ప్రాంతాల్లో ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో వాల్తేర్ రైల్వే డివిజన్లో రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం చేకూరే పనులు చేయవద్దని వాల్తేర్ డివిజన్ DRM అనూప్ సత్పతీ కోరారు. రైల్వే ఆస్తులు దేశ ఆస్తులు అనీ, వాటిని నిర్మించడానికి అనేక సంవత్సరాలు పడుతుంది అనీ తెలిపారు ఆయన. అందుకే ప్రజలకు ఎవ్వరి మీద అనుమానం కలిగినా, లేక సందేహాస్పదంగా రైల్వే పరిసర ప్రాంతాల్లో ఎవరు కనపడినా వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు .