Nara Lokesh in Vizag: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్‌కు ఘనస్వాగతం, ఆదివారం నుంచి ఉత్తరాంధ్రలో శంఖారావం
Nara Lokesh Election Campaign: విశాఖపట్నం: విశాఖ ఎయిర్ పోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు ఘనస్వాగతం లభించింది. ఇచ్చాపురంలో ఆదివారం (ఫిబ్రవరి 11) నుంచి ప్రారంభంకానున్న శంఖారావం కోసం యువనేత నారా లోకేష్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నారా లోకేష్‌కు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వస్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ముఖ్యనేతలను పేరుపేరునా పలకరించారు లోకేష్. పార్టీశ్రేణులకు అభివాదం చేసిన అనంతరం లోకేష్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన ఇచ్చాపురం బయలుదేరారు.
మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు మూడు చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో లోకేశ్ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఇచ్చాపురంలో ఆదివారం ఉదయం 10.30గంటలకు యువనేత లోకేష్ చేతులమీదుగా శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో లోకేష్ కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడంతో పాటు వైసీపీ అక్రమాలను ఎదుర్కోవడంపై తెదేపా క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జులు, కుటుంబ సాధికార సారథులకు దిశానిర్దేశం చేస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కారణంగా 79రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్ర నిర్వహించలేకపోయారు. విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద యాత్రను ముగించాల్సి వచ్చింది. కనుక శంఖారావం తొలి విడతలోనే ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో పర్యటించాలని లోకేశ్ నిర్ణయించారు. శంఖారావంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఇచ్చాపురం చేరుకున్నారు.
త్వరలోనే చంద్రబాబు రోడ్ షో
'రా.. కదలిరా' సభలు ముగిశాయని.. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో యువగళం పాదయాత్ర అనుకున్న విధంగా ముందుకు సాగలేదని.. 'శంఖారావం' ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలు మొత్తం చుట్టివచ్చేలా భారీ బహిరంగ సభల్లో ప్రజలతో లోకేశ్ మమేకం కానున్నారని చెప్పారు. '120 నియోజకవర్గాల్లో 40 రోజులు శంఖారావం కొనసాగుతుంది. తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ పున:ప్రారంభమై ఎక్కడ మళ్లీ తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో సీఎం జగన్ వణికిపోతున్నాడు. జగన్ రెడ్డి, వైసీపీనేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా నిర్వాహకులు పెద్ద ఫేక్ ఫెలోస్. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ ఫేక్ ఫెలోస్ కు బుద్ధి చెబుతాం. కోడి కత్తి శ్రీనివాస్ కు బెయిల్ రావడం నిజంగా సంతోషకరం. అమాయకుడిని రక్షించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకున్న గౌరవం మరింత పెరిగిందని' అచ్చెన్నాయుడు అన్నారు.
పార్టీ ముఖ్యనాయకులు.