(Source: ECI/ABP News/ABP Majha)
దొరల దసరా పండుగ చూశారా? పత్రిని పొలాల్లో ఎందుకు వేస్తారు?
వేప చెట్టుపై ఓ తురాయి పూవ్వును ఉంచి దాన్ని కొడతారు అది ఎటువైపు పడితే ఆ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయనే విశ్వాసం కూడా ఉంది.
విజయదశమి ఆంధ్రా ఓడిశా సరిహాద్దులో ఒకరోజు ముందుగానే దసరా ఉత్సవం నిర్వహించారు. గిరిజనుల సంస్కతి సంప్రదాయాలకు ఆ ప్రాంతంలో ఓ ప్రత్యేక కొనసాగుతుంది. తాతల తండ్రుల కాలం నుంచి వారు ఆ వారసత్వాన్ని పాటిస్తూనే ఉన్నారు. తరాలు మారుతున్నా మనుషుల నడవడికలో తేడాలు వస్తున్న సనాతన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లా భామినిలో రాజుల కాలం నుంచి కూడా దుర్గమ్మను కొలిచేందుకు ఊరుఊరంతా వెళ్లి మొక్కుకోవడం దొరల దసరా పండుగే ప్రత్యేకత.
శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రా ఒడిశా సరిహాద్దుల్లోని భామిని గ్రామంలో రాజుల కాలం నుంచి కీర్తిరాయి కొండ దొరల ఇలవేల్పుగా కోటకొండ దుర్గమ్మను మొక్కుకుంటున్నారు. అదే సాంప్రదాయాన్ని ఆప్రాంతీయులంతా కొనసాగిస్తున్నారు. విజయ దశమికి ముందుగా వచ్చే పోలాల అమావాస్య నుంచి 5 రోజుల పాటు దొరలు దసరా పండుగను ఉన్నంతలో వైభవంగా జరుపుకొవడం అనవాయితీగా వస్తుంది. ఒడిశాలోని పర్లాకిమిండి గజపతి మహరాజుల పాలనలో ఉన్న ప్రాంతాన్ని గిరిజన వంశీయులైన కీర్తిరాయి దొర కుటుంభీకులకు మోఖాసగా అప్పగించారు. అప్పటి నుంచి దొరల ఆధ్వర్యంలో కోట దుర్గమ్మ పండుగ సందర్భంగా దసరాను జరుపుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది భామిని దొరల దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
5 రోజులలపాటు జరిగే ఈ ఉత్సవాల‌్లో భాగంగా ముందుగా గ్రామం నలుదిక్కులా ఉన్న గ్రామదేవతలకు ముర్రాటలతో అభిషేకాలు చేసి పూజిస్తారు. ఆ తర్వాత కీర్తిరాయి వంశీయుల ఆయుధాలను మేళతాళాలతో వంశధార నదితీరానికి తీసుకువెళ్లి అక్కడ నీటిలో శుద్ది చేస్తారు. తిరిగి వాటిని కీర్తిరాయి దొర ఇంటి వద్దకు తీసుకువచ్చి వాటిని పూజిస్తారు. చివరి రోజున మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ కీర్తారాయి వంశీయుడైన క్రిష్ణచంద్ర దొర రాజ వేషధారణలో గుర్రపు స్వారీగా కోట కొండ దుర్గమ్మ ఆలయానికి ఊరేగింపుగా బయల్దేరుతారు. అక్కడ కూడా ఈ ఆయుధాలను పూజిస్తారు. తద్వార శక్తి వస్తుందని నమ్మకం.
ఈ ఏడాది కృష్ణచంద్రదొర కుమారుడు నవీన్ చంద్రదొర గుర్రంపై మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి దసరా పూజలు నిర్వహించారు. ఆయన వెనుక మహిళలు, వృద్ధులు, యువత ఇలా ఊరు ఊరంతా బయలుదేరి వెళ్లారు. భామిని గ్రామానికి కొంతదూరంలో ఉన్న వేప చేట్టువద్ద అమ్మవారు కొలువై ఉందని నమ్మకం. ఆ విశ్వాసంతో అక్కడ రాత్రి పూట అమ్మవారి సన్నిధిలో ఆయుధాలు ఉంచి పూజలు చేయడం సంప్రాదాయం. ఆయన వెంట చుట్టుప్రక్కల ఉన్న గిరిజనులతోపాటు గ్రామస్తులు సంప్రదాయ నృత్యాలతో ఆలయానికి వెళ్లి అక్కడ కొలువైన అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
ఈ సందర్భంగానే వేప చెట్టుపై ఓ తురాయి పూవ్వును ఉంచి దాన్ని కొడతారు అది ఎటువైపు పడితే ఆ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయనే విశ్వాసం కూడా ఉంది. అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఈ మొక్కులు చెల్లించడం ద్వారా గ్రామానికి అక్కడ ఉండే ప్రజలకు శుభం జరుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. జంతు బలులు ఇచ్చిన తర్వాత పత్రి కొమ్మలను రక్తంలో ముంచి వాటిని తిరిగి పంట పొలాల వేస్తారు. అలా చేయడం వల్ల పంటలకు ఛీడపీడతెగులు రాకుండా బాగా పండుతాయని వారి నమ్మకం.
ఎప్పటిలాగనే ఈ ఏడాది కూడా భామినిలో దొరల దసరా ఐదు రోజుల పాటు వైభవంగా జరిగింది. రాజుల కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం రాజరికాలు అంతరించిపోయినప్పటికి ఇక్కడి దొరల వంశీయులు దీనిని కొనసాగిస్తున్నారు. ఈ సరిహాద్ధు ప్రాంతంలో కేవలం భామినిలో సాగి ఈ సాంప్రదాయానికి స్థానికులు కూడా గౌరవిస్తూ వాటిలో పాలుపంచుకోవడం ఆ ప్రాంతీయులకు దుర్గమ్మపై ఉండే అపారమైన విశ్వాసంగానే చెప్పుకోవచ్చును.