Vizag News: విశాఖ పోర్ట్ ట్రస్ట్ గేట్ వద్ద ఉద్రిక్తత- ఉద్యోగాలు కల్పించాలని మత్స్యకారుల ఆందోళన
విశాఖ పోర్టు ట్రస్ట్ పరిసరాల్లోని మత్స్యకారులు భగ్గుమన్నారు. తమ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని మండిపడుతున్నారు.
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గేట్ ఎదురుగా మత్స్యకారులు ఆందోళకు దిగారు. పోర్ట్ కు సంబంధించి కంటైనర్ టెర్మినల్ నిర్మాణంలో తమ భూములు కోల్పోయామన్నారు నిర్వాసితులు. 2002లో కంటైనర్ టెర్మినల్ నిర్మించేటప్పుడు తమకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు తమకు ప్రాధాన్యత ఇవ్వకపోగా ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
విశాఖ కంటైనర్ టెర్మినల్లో ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వకుండా స్థానిక రాజకీయ నాయకులు చెప్పిన వారికి ఇవ్వడం పై గంగపుత్రులు మండిపడుతున్నారు. VCTPLఏర్పాటులో భూములు కోల్పోయిన 500పైగా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని మత్యకారులు విశాఖ పోర్ట్ ట్రస్ట్ GCB గేట్ ఎదుట ఆందోళన చేశారు.
ఉద్యోగాలు ఇవ్వకపోవడంతోపాటు తమ చేపల వేట కూడా సాగనివ్వడం లేదని వాపోతున్నారు మత్స్యకారులు. పోర్టుకు దూరంగా వేటాడదామన్నా తమకు భద్రతా కారణాలు చెప్పి అనుమతి ఇవ్వడం లేదని బోరుమంటున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ గేట్ వద్ద రోడ్డుపై కూర్చుని పోర్ట్ లోనికి వెళ్లే వాహనాలను మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మత్స్యకారుల ఆందోళనతో పోర్ట్ ట్రస్ట్ గేట్ వద్ద కాస్త గందరగోళం నెలకొంది. పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చేది. CISF సిబ్బంది కూడా కలుగజేసుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను నెరవేర్చి ,ఉద్యోగాలను తమతో భర్తీ చేయకపోతే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని మత్స్యకారులు అంటున్నారు.