Duvvada Srinivas Issue: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి సంచలన నిర్ణయం, భర్తతోనే ఉండేందుకు ఓకే
duvvada srinivas : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీనివాస్ భార్య జడ్పిటిసి దువ్వాడ వాణి ఆయనతో కలిసి ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
Mlc Duvvada Family Issue: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సతీమణి దువ్వాడ వాణి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా టెక్కలిలోని ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇంటి వద్ద కుమార్తెతో క లిసి పది రోజులుగా నిరసన తెలియజేస్తున్న ఆయన సతీమణి వాణి శనివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. తన భర్తతో కలిసి ఉండేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన పది రోజులు నుంచి ఇంటి బయట కుమార్తెతో కలిసి నిరసన తెలియజేస్తున్నా ఆయనలో ఏమాత్రం చలనం రాకపోవడం బాధాకరమన్నారు. చిన్న బిడ్డలు రోడ్డుపై పడుకున్నా ఆయన పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని వాణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంట్లోనే 24 గంటలూ ఉంటున్నారని, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు. 29 ఏళ్లుగా కలిసి ఉన్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా అనేకమైన ఆరోపణలు చేస్తుండడం దారుణమన్నారు. తాము కొడుతున్నామంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు బాధను కలిగిస్తున్నాయని వివరించారు. ఈ తరహా ఇబ్బందులు గతంలో ఉంటే తాము ఇన్నాళ్లపాటు కలిసి ఎలా ఉండేవాళ్లమని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత నుంచి శ్రీనులో అహంకారం పెరిగిందని ఆరోపించారు. పదవి, డబ్బు పెరిగిన తరువాత తప్పుడు ఆలోచనలు పెరిగినట్టు విమర్శించారు. స్వార్థ్యంతో శ్రీను ఆలోచిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
త్యాగంగా భావిస్తేనే ఇబ్బందులు
గడిచిన 13-14 నెలలు నుంచి శ్రీనులో మార్పు వచ్చినట్టు వాణి పేర్కొన్నారు. పిల్లలు మాట్లాడే ప్రయత్నం చేసినా విన లేదన్న ఆమె.. తల్లి, సోదరుడు పిల్లలను ఇష్టానుసారంగా మాట్లాడారని విమర్శించారు. శ్రీను స్వార్థంతో ఆలోచిస్తున్నారని, కుటుంబానికి తాను సేవ చేశానని, త్యాగం చేసినట్టు ఎప్పుడూ భావించలేదన్నారు. తనకు కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఏనాడూ కాంప్రమైజ్ కాలేదన్నారు. కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు నేపథ్యంలో శ్రీను అనేక రకాల స్టోరీలు చెబుతున్నారని, క్రియేట్ చేస్తున్న స్టోరీలు వింటుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు బిడ్డలపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పిల్లలు కారం, వెపన్స్ పట్టుకుని వచ్చినట్టు శ్రీను చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఆరోపణలతో ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళుతుందన్న ఉద్ధేశంతోనే తానో నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. కుటుంబాన్ని రక్షించుకునేందుకే తన పోరాటమని, రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి ఇందులో లేదన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కుటుంబంలో ఎవరో ఒకరు ముందుకు వెళ్లాలన్న ఉద్ధేశంతో తాను ఆలోచించినట్టు తెలిపారు. పదవి, ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బు కారణంగానే వ్యవహారశైలి మారిందన్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఇలా వ్యవహరించలేదని, ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ వాణి వాపోయారు.
పిల్లలు భవిష్యత్ కోసం నిర్ణయం
సమస్యను తప్పుదారి పట్టించేందుకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికీ ఆయన సోదరుడు, తల్లే మాట్లాడుతున్నారని జెడ్పీటీసీ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉందని, కాబట్టి వారిపై ప్రభావం పడకూడదన్న ఉద్ధేశంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఒకే ఇంట్లో ఉండేందుకు తాను సిద్ధమని, ఎటువంటి షరతులు కూడా పెట్టనని స్పష్టం చేశారు. శ్రీను ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని లీడ్ చేసుకోవచ్చని, కానీ, పిల్లలు జీవితం కోసం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆయన నుంచి రూపాయి ఆస్తి తనకు గానీ, తన బిడ్డలకుగానీ అవసరం లేదన్నారు. ఇందుకు రాతపూర్వకంగా హామీ ఇస్తే చాలని ఆమె పేర్కొన్నారు. డబ్బు, రాజకీయం కోసమే తాము ఇదంతా చేస్తున్నామని చెబుతున్న దానిలో వాస్తవం లేదన్నారు. తన ఇద్దరు ఆడ పిల్లలు జీవితాలు కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.