శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో తాగునీటి కష్టాలు- జనవరి నుంచే పల్లెల్లో దాహం కేకలు
Srikakulam News: కిలోమీటరు దూరం వెళ్తేకానీ దాహం తీరదు. జనవరిలోనే తాగునీటి సమస్య వచ్చింది. ఇబ్బంది తొలగిస్తామన్న లీడర్లు పట్టించుకోలేదు.శ్రీకాకుళం జిల్లాలోని ఓ మండలంలోని ప్రజల తాగునీటి కష్టాలు ఇవి

Srikakulam News: మెళియాపుట్టి మండలంలోని పలు గ్రామాల్లో వేసవికి ముందే దాహం కేకలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షాలు కురవడంతో కాస్త ఫర్వాలేదనిపించినా సంక్రాంతికే తాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీటి పథకాలు పనిచేయకపోవడంతోపాటు బోరు బావులు అడుగంటిపోవడంతో సమస్య తలెత్తింది. సంక్రాంతి పూట తాగునీటి ఇబ్బందులను గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
మెళియాపుట్టి మండలంలోని మురికింటిభద్ర గ్రామంలోని ఓ వీధి ప్రజలు తాగునీరు కావాంటే సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకొని వెళ్తే తప్ప దాహం తీరడంలేదు. అదికూడా పక్కనే ఉన్న పలాస మండలంలోని గోపి వల్లభాపురం గ్రామానికి చెందిన బోరు పంపు వద్దకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆ గ్రామస్థులు తమ గ్రామంలో ఓ వైపు వీధికి నీరు పుష్కలంగాఉంది. ఇంటింటా నీరందిస్తామని పైపులు వేసినప్పటికీ ఫలితం శూన్యమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యేటా ఇదే తాగు నీటి సమస్య తలెత్తుతోందని అంటున్నారు. గతంలో వేసవిలో తాగునీటి సమస్య వస్తే ఇప్పుడు మాత్రం జనవరిలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకువెళ్ళామని అయినా ఫలితం లేదంటున్నారు. సంక్రాంతి టైంలో ఊరూరా బసవన్నలను తిప్పుకొని పొట్టనింపుకొనేవారమని, తమ ఇళ్ళ వద్ద వృద్ధులు మాత్రమే ఉన్నారని, దీంతో తమకు నీటి సమస్య తీవ్రతరంగా ఉందని వాపోతున్నారు.

ఇది ఒక్క గ్రామానికి చెందిన సమస్యకాదు. మండలంలోని చాలా పల్లెల కథ. శాంపిల్‌గా ఒక గ్రామంలోని ప్రజలతో మాట్లాడితే అనేక విషయాలు పంచుకున్నారు. ఎన్నికల ముందు నాయకులు ఇచ్చే హామీలకు కొదవలేదు. ఇప్పుడు నీరు లేదని అడిగితే మొహం చాటేస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పాడనికి చుట్టూ జలవనరులు ఉన్నప్పటికీ తాగడానికి మాత్రం చుక్క నీరుకు కరవు అవుతుందని వాపోతున్నారు. పక్క నుంచే వెళ్లే నీటిని స్టోరేజ్ చేసి వాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది ఏళ్లు దాటుతున్న ప్రాజెక్టులను పెండింగ్ ఉండిపోయని ఆవేదన చెందుతున్నారు. పెద్ద పండుగకు బంధువులు పిల్లలు అందరూ తాగునీటి సమస్య ఎదుర్కొన్నామని అంటున్నారు.
Also Read: భోగి వేడుకల్లో పాల్గొన్న వంగలపూడి అనిత, కూతురితో పోటీపడి మరీ డ్రమ్స్ వాయిస్తూ సందడి
బయట నుంచి మంచినీళ్లు కొనుక్కొని తీసుకొద్దాం అంటే ఒక 20 లీటర్ బాటిల్ 30 రూపాయలు ఉంది. అది కూడా తక్కువ మాత్రమే ఇస్తున్నారు. ఉదయాన్నే ఇంట్లో ఒక మనిషి మంచినీరు తెచ్చుకోవడానికి వెళ్లి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. కూలి పనులు కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మంచినీరు తెచ్చుకునేసరికి ఆ రోజు పోతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పంచాయతీ ఎలక్షన్స్ రానే వస్తున్నాయి ఇప్పుడు మళ్లీ ఈసారి మన ప్రభుత్వం వచ్చింది కచ్చితంగా చేస్తారు మాటిస్తున్నాను అంటూ నాయకులు గ్రామాలు చుట్టూ తిరుగుతున్నారు.

పక్క మండలానికి చెందిన పంచాయతీ వాళ్లు నీరు ఇవ్వకుంటే పరిస్థితి మరింత దారుణమని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఇప్పటికీ మండలంలో తాగునీటికి పక్క మండలంపై ఆధార పడడం కొంతమేర ఆలోచించాల్సిన విషయమని అంటున్నారు.ఎప్పటికైనా కిలోమీటర్ల దూరం నుంచి తమ అవసరాలకు నీటిని మోసి తెచ్చుకునే పరిస్థితి తప్పుతుందనే ఆశగా ఎదురుచూస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ మంచినీటి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో నరసింహప్రసాద్ పండా వద్ద ప్రస్తావించగా సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Also Read: షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు ఉన్నా సంత సందడే వేరు, నేటికీ ప్రాధాన్యత తగ్గలేదు





















