Cyclone Gulab Latest: తుపాను తీరం దాటిన టైంలో జరిగిన బీభత్సం ఇదీ.. వెల్లడించిన కలెక్టర్, రేపు ఇంకో అల్పపీడనం
తుపాను వల్ల వస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు.
గులాబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య ఆదివారం రాత్రి తీరం దాటిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. తుపాను బీభత్సం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో ఎక్కువ నష్టం జరగలేదని తెలిపారు. కొన్నిచోట్ల చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం జరిగిందని.. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. అన్ని శాఖలు రంగంలోకి దిగి తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాయని తెలిపారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. తుపాను ప్రభావం పూర్తిగా తొలగే వరకు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందక బృందాలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని కలెక్టర్ చెప్పారు.
Also Read: గులాబ్ తుపాను ప్రభావం.. ఏపీలో కుంభవృష్టి, తెలంగాణలో మరో 3 రోజులు దంచికొట్టనున్న వానలు
తుపాను వల్ల వస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడగా.. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు అయ్యారు. నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో రద్దైన, దారిమళ్లించిన రైళ్ల వివరాలివే...
మరోవైపు, గులాబ్ తుపానుపై విశాఖ నుంచి చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు కూడా రివ్యూ చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్ అదిత్య నాథ్ చర్యలు చేపడుతున్నారు.
తుపాను కారణంగా సోమవారం తెలంగాణలో అత్యంత భారీ కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కుంభవృష్టి అయితే రెడ్ అలర్ట్, భారీ వర్షాలు పడే సూచనలుంటే ఆరెంజ్ అలర్ట్, ఓ మోస్తరు వర్షాలకు ఎల్లో అలర్ట్‌లను జారీ చేస్తుంటారు.
Also Read: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్…హైదరాబాద్ వాసులు తప్పనిసరైతే కానీ బయటకు రావొద్దని హెచ్చరికలు
సోమవారం మరో ఆవర్తనం ఏర్పడే ఛాన్స్
సోమవారం బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 29 నాటికి బెంగాల్ వైపు వెళ్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం తెలంగాణలో 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Also Read: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే..