ముంబై కంటే దారుణంగా విశాఖ గాలి నాణ్యత- లేటెస్ట్ ఎక్యూఐ ఇదే!
దీపావళిలో కాల్చిన బాణసంచా కారణంగా ఆయా నగరాల్లో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. గాలి నాణ్యత విశాఖలో దారుణంగా ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు చాలా నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీపావళి తర్వాత రోజున అంటే మంగళవారం లెక్కలు చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. దీపావళి తర్వాత, దేశ రాజధాని ఢిల్లీ గాలి నాణ్యత మంగళవారం (అక్టోబర్ 25) ముంబై కంటే అధ్వాన్నంగా ఉంది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) వెబ్సైట్ ప్రకారం... ఢిల్లీ వాయు నాణ్యతా సూచిక మంగళవారం ఉదయం 325గా నమోదైంది. అంటే అక్కడి గాలి పీల్చేందుకు అనువుగా లేదని అర్థం.
ముంబైలో ఏక్యూఐ 198గా నమోదైంది. వెబ్ సైట్ ప్రకారం, ఇది బ్యాలెన్స్‌డ్ కేటగిరీలో ఉన్నట్టు అర్థం. దేశంలోని మరో రెండు మెట్రో నగరాలు చెన్నై, కోల్‌కతా లో వరుసగా 233, 38 ఎక్యూఐని నమోదు చేశాయి. చెన్నై గాలి 233 ఎక్యూఐతో పేలవమైన విభాగంలో ఉందని నివేదిక చెబుతోంది. 38 ఎక్యూఐతో కోల్ కతా గాలి చాలా స్వచ్ఛమైనదిగా చెబుతోంది.
లేటెస్ట్ లెక్కల ప్రకారం హైదరాబాద్, విశాఖలో గాలి నాణ్యత చూస్తే కాస్త జాగ్రత్త పడాల్సిన టైం వచ్చిందని తెలుస్తోంది. హైదరాబాద్ ప్రస్తుతం మధ్యస్థంగా ఉన్నప్పటికీ.. విశాఖలో గాలి నాణ్యత పేలవంగా ఉంది. హైదరాబాద్ 161తో ఉంటే విశాఖ దానికి డబుల్ 241గా చూపిస్తోంది. ముంబైలో గాలి నాణ్యత 198 ఉంటే... విశాఖలో సుమారు 250 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇలా ఉంది
- అనంతపురం- 183
- ఏలూరు- 70
- రాజమండ్రి- 93
- తిరుపతి- 70
దీపావళి రెండవ రోజున ఢిల్లీ ఎక్యూఐ చాలా పేలవమైన కేటగిరీలో ఉంది. కానీ గత సంవత్సరం పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండేది. 2021 దీపావళి మరుసటి రోజు ఢిల్లీలో ఏక్యూఐ 462గా నమోదైంది. గత ఏడేళ్లుగా దీపావళి మరుసటి రోజు ఢిల్లీ ప్రజలు విషవాయువులు పీలుస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఏక్యూఐ 2016లో 445, 2017లో 407, 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదైంది.
ఇతర పెద్ద నగరాల్లో గాలి నాణ్యత
దీపావళి తరువాత దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత చూస్తే...
- డెహ్రాడూన్ 332,
- భువనేశ్వర్ 313,
- గ్రేటర్ గురుగ్రామ్ 314,
- ఫరీదాబాద్ 311,
- నోయిడాలో 316,
- ఘజియాబాద్ 275,
- ఉజ్జయినిలో 268,
- లూథియానాలో 265,
- జలంధర్ లో 252,
- జైపూర్ లో 248,
- గ్వాలియర్ 238,
- ఝాన్సీలో 235,
- కోటాలో 230,
- జబల్ పూర్ లో 223,
- మొరాదాబాద్ లో 223,
- ఇండోర్ 209,
- యమునానగర్ 208
- గాంధీనగర్ 202,
- లక్నోలో 199,
- ఉదయపూర్ లో 197,
- నాగ్ పూర్ లో 195,
- ఆగ్రాలో 194,
- కాన్పూర్ లో 192,
- చండీగఢ్ 177,
- అహ్మదాబాద్ 176,
- పాట్నాలో 170,
- వారణాసిలో 147,
- నాసిక్ లో 144,
- ప్రయాగ్ రాజ్ లో 132,
- షిల్లాంగ్ లో 132,
- మైసూర్ లో 73,
వాయు కాలుష్యం వెనుక ఉన్న కారణం ఏమిటి?
దీపావళి తర్వాత రోజున గాలి నాణ్యత క్షీణించడం వెనుక ఉన్న కారణాలలో ఒకటి బాణాసంచా నుంచి వచ్చే పొగ అని చెబుతారు నిపుణులు. ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ, బాణసంచా కాల్చారు. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను కాల్చడం కూడా ఢిల్లీలో కాలుష్యానికి కారణమని భావిస్తున్నారు.