Adani Data Center : విశాఖ డేటా సెంటర్‌కు శంకుస్థాపన - హాజరైన అదానీ కుమారులు !
విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అదానీ కుమారులు ఇద్దరు హాజరయ్యారు.

Adani Data Center : రుషికొండ హిల్ నెంబర్ 4లో అదానీ - వైజాగ్ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కాలేదు. ఆయన ఇద్దరు కుమారులు, అదానీ గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జీత్, కరణ్ అదానీలు హాజరయ్యారు. విశాఖపట్నం డాటా టెక్నాలజీకి సెంటర్ గా మారుతుందని ఈ సందర్భంగా కరణ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు.
అదానీ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32 వేల మందికి పైగా ఉపాధి దొరకనుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే స్కిల్ కాలేజీ, రీక్రియేషన్ సెంటర్ల ద్వారా మరో 3 వేల మందికిపైగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్ కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కాలేజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ కేంద్రానికి 9 ఎకరాలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భూమి పూజ జరిగిన తర్వాత వెను వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఏకంగా, రూ. 21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రీక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ పట్నంలోని మధుర వాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయల చొప్పున 190.29 ఎకరాలను అదానీ గ్రూపుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
మొదట 130 ఎకరాల్లో 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అదానీ గ్రూపు.. ఆ తర్వాత మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో మరో 60.29 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. ఉద్యోగాల కల్పన ఆధారంగానే రాయితీలు, ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కారు వీటీపీఎల్ తో ఒప్పందం చేసుకుంది. మొత్తం 5 దశల్లో ఈ ప్రాజెక్టును మొత్తంగా 7 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 39,815 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని వీటీపీఎల్ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది.





















