Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్‌లో అదానీ బృందం- అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించిన కార్మికులు!
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్రిక్త వాతావారణ చోటు చేసుకుంది. అక్కడ కార్మికులంతా కలిసి అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. ప్రైవేటీకరణ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు.
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎలాంటి కామెంట్లు చేయకపోవడంతో కార్మికులు మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల నడుమ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అడ్మిన్ బిల్డింగ్‌ను ఉక్కు కార్మికులు ఈరోజు ముట్టడించారు. ప్రైవేటీకరణ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్‌లో అదానీ బృందం పర్యటిస్తోందని.. వారు ఎందుకు వచ్చారు, వారికి ఏం చెప్పారో వెల్లడించాలని కోరుతూ.. కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ప్లాంటు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. స్పందించిన యాజమాన్యం మాత్రం అదానీ బృందం ఏం రాలేదని, స్టీల్ ప్లాంట్ ఇండిపెండెంట్ డైరెక్టర్లు మాత్రమే వచ్చారని, వారికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నామని తెలిపారు.
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం..
ప్లాంట్ టౌన్ అడ్మినిస్ట్రేషన్ భవనంలో డైరెక్టర్లకు పవన్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని సమాచారం అందించడంతో పోరాట కమిటీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. అయితే రూటు మార్చిన అధికారులు వారిని ప్రధాన పరిపాలన భవనం వద్దకు తీసుకువెళ్లారని తెలియడంతో వీరంతా అక్కడకు వెళ్లారు. పరిపాలనా భవనంలోకి వెళ్లేందుకు కార్మిక నేతలు ప్రయత్నించగా.. పోలీసులు, సీఆఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ప్లాంట్ ఉత్పత్తిని గాలికి వదిలి ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో యాజమాన్యం ఉందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బ్లాస్ట్ ఫేర్నేస్ లో ఉత్పత్తి తగ్గించారన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు. కార్మిక వర్గం చేసే ఆందోళనకు యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్లాంట్ ప్రజల ఆస్తి అని, దాని జోలికి వస్తే సహించేది లేదన్నారు. ప్లాంట్ లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చేందుకు యత్నించినా, యాజమాన్యం సహకరించినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
26 వేల ఎకరాల్లో విస్తరించిన ప్లాంట్..
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు వద్దంటూ ఉద్యోగులు, కార్మికులు ఏకధాటిగా చేస్తున్న ఉద్యమం ఈ మధ్యే 600 రోజులు దాటింది. వివిధ వర్గాల నుంచి మద్దతు తీసుకుంటున్న ఉద్యమకారులు... ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు. తమ పోరాటం ప్రారంభించి 600 రోజులు పూర్తయిన సందర్భంలో నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలియ జేస్తామంటున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పిలిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పేరుమీదే విశాఖ నగరానికి ఉక్కునగరం అనే పేరు స్థిరపడింది. ప్రారంభంలో ఏడాదికి 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7. 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యక్షంగా 17,500 మంది ఉద్యోగులూ, పరోక్షంగా లక్ష మంది ఈ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి పని చేస్తున్నారు.