Srikakulam News: అధికారంలో ఉన్న పార్టీ బలహీన పడటం చాలా సహజం- మరోసారి మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్
మంత్రి ధర్మాన ప్రసాద రావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ, కార్యకర్తలు, ప్రభుత్వంపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి.
శ్రీకాకుళం జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జిల్లాలో అసంతృప్తులు పెరిగిపోతున్నప్పుడు ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసంతృప్తులతోపాటు పార్టీపై కూడా హాట్ కామెంట్స్ చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బలహీనపడటం సహజమే అంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అధికారంలో ఉన్న వారికి అసంతృప్త బెడద ఉంటుందన్నారు. అందుకే అలాంటి సమస్య లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. సాచ్యురేషన్ పద్దతిలో సంక్షేమ పథకాలును అందిస్తున్నామన్నారు ధర్మాన. నిస్పృహలో ఎవరూ ఉండకూడదనే వీలైనంత వరకు సర్దుబాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని... దివాళా తీసేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారని... మరి సంక్షేమ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారు ధర్మాన ప్రసాదరావు. రెండో వ్యక్తికి తెలియకుండానే లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు పడిపోతున్నాయన్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలన్నారు ధర్మాన. గడగడపకూ వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు డబ్బులు డంప్ చేసిన సంగతి గుర్తు చేయాలన్నారు.
నయాపైసా అవినీతి లేకుండా పని చేస్తున్నామన్న ధర్మాన ప్రసాద రావు... కొన్ని ప్రభుత్వ శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని శాఖల్లో అవినీతి ఉందని గుర్తు చేశారు మంత్రి... ఆ పరిస్థితి మారాలని హెచ్చరించారు. అవినీతి లేని రాష్ట్రం చూడాలని సీఎం జగన్ ఆశిస్తున్నారని ఆదిశగా అంతా ప్రయత్నాలు చేయాలని సూచించారు.
కార్యకర్తలు లేని ఏ పార్టీ బతకదన్న ధర్మాన ప్రసాదరావు... వాళ్లే పార్టీకి ప్రధానమన్నారు. వారిలో చాలా మందికి అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న ధర్మాన... అన్ని సర్దుకుంటాయన్నారు. కార్యకర్తలకు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్నింటిని మర్చి పోయి పార్టీ మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి సూచించారు.
ప్రజల్లో తిరగదామని ఫీడ్ బ్యాక్ తీసుకుందామన్నారు మంత్రి ధర్మాన ప్రసాద రావు. ప్రజలు చెప్పిన వివరాలను పార్టీ అధిష్ఠానానికి తెలియజేద్దామన్నారు. అప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
విషయాన్ని సూటిగా చెప్పడం ధర్మానకు ఉన్నఅలవాటు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్స్ చేశారు. పార్టీ నేతలపై, కార్యకర్తలపై, ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న అవినీతిపై వాగ్బాణాలు విసురుతుంటారాయన. ఇలాంటివి ఎవరో ఒకరు చెప్పకుంటే పై స్థాయి వరకు విషయాలు వెళ్లవని.. పార్టీ నష్టపోతుందని, వాస్తవికంగా ఆలోచించి ధర్మాన ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని తన అనుచరులు అంటుంటారు.