Dharmana On CM Jagan Tour: సీఎం పర్యటనలో బాధ్యతాయుతంగా ఉండాలి- సిక్కోలు వైసీపీ శ్రేణులకు ధర్మాన క్లాస్
సీఎం జగన్ మోహన్ రెడ్డి 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ టూర్ ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. దీనిపై సమీక్ష నిర్వహించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి ఆలోచనతో సీఎం జగన్ పరిపాలిస్తున్నారో ఆ విషయాన్ని ప్రజలకు చేరేలా జగన్ టూర్ ఏర్పాట్లు ఉండాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్ సిక్కోలు పర్యటనపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ముఖ్యమంత్రి భావజాలం అందరికీ చేరేలా సభా ప్రాంగణం తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నాళ్ల నుంచో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తారని జిల్లా ప్రజలు వేచి చూస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆ కల నెరవేరుతోందన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ స్టేడియం నిర్మాణ పనులకు నిధులు విడుదల చేయనున్నారని చెప్పారు ధర్మాన. దీనిపై సీఎం ప్రకటన చేయనున్నారన్నారు.
అమ్మ ఒడి మూడో విడతను సిక్కోలు నుంచి ప్రారంభించి, సంక్షేమానికి సంబంధించి వివిధ వర్గాలకు కొన్ని కీలక విషయాలను వివరిస్తూనే, సంబంధిత పథకాల ఆవశ్యకతపై సీఎం మాట్లాడతారన్నారు ధర్మాన. ఈ నెల 27న జరిగే సీఎం పర్యటనకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగంతో గురువారం సమావేశమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సీఎం పర్యటన సందర్భంగా ఏమరపాటు తగదని, ఏర్పాట్ల విషయమై జాగ్రత్త వహించాలని దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణమైన కేఆర్ స్టేడియంలో సీఎం ప్రసంగిస్తారన్నారు. ఆయన భావజాలం సిక్కోలు ప్రజలకు, పథకాలు పొందే లబ్ధిదారులకూ, ఇతర ప్రజానీకానికి చేరే విధంగా ఏర్పాట్లు ఉండాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు వెనుక విస్తృత భావ జాలం ఉందన్నారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని, ముఖ్యంగా బ్రిటిషర్ల కాలం నుంచి వ్యవసాయ రంగంలో వృద్ధిలోనే ఉన్నామని అన్నారు ధర్మాన. అయితే అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నామని, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో అక్షరాస్యతలో 22వ స్థానంలో ఉన్నట్లు ధర్మాన వివరించారు. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్‌కు మాత్రమే విద్యావకాశాలు నిన్న మొన్నటి వరకు అందేవని, కానీ అందరికీ విద్యావకాశాలు అందించేందుకు గత ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు తక్కువన్నారు. ఆ నేపథ్యం నుంచి చూస్తే అమ్మ ఒడి కార్యక్రమం ప్రాధాన్యత ఏంటన్నది అందరికీ అర్థం అవుతుందన్నారు.
ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు షూ దగ్గర నుంచి, యూనిఫాం, భోజనం ఇలా ప్రతి అంశంపై కూడా శ్రద్ధ తీసుకుని బడులను ఆధునికీరించి, మంచి చదువులు అందించాలన్న బాధ్యతతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ధర్మాన ప్రసాదరావు. అమ్మఒడి ఓట్ల కార్యక్రమం కాదని, విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్న సంకల్పంతో ప్రారంభించిన కార్యక్రమమని అన్నారు. నిరుపేద విద్యార్థులు చదువుకి దూరం కాకూడదన్న సంకల్పంతో చేట్టిన ఈ కార్యక్రమంపై ప్రతిపక్షం అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తుందన్నారు.
మూడో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అక్షరాస్యతలో వెనుకబడిన సిక్కోలు జిల్లాను ఎంచుకున్నప్పుడు తనతోపాటు జిల్లా ప్రజలుఎంతో బాధ్యతగా ఉండాలని ధర్మాన పిలుపునిచ్చారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు నిర్వర్తించాలని, ఎవ్వరూ కూడా విఫలం కావద్దని, బాధ్యత తీసుకున్నాక తూతూమంత్రంగా చేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదని ధర్మాన స్పష్టం చేశారు.
సీఎం భావజాలాలు ప్రజల్లోకి చేరినప్పుడే కార్యక్రమం విజయవంతం అయినట్లని ధర్మాన ప్రసాదరావు అన్నారు. అందుకు అనుగుణంగా సభకు వచ్చే వారిని క్రమశిక్షణాయుత వాతావరణంలో ఉండే విధంగా చేయగలగాలన్నారు. ప్రతి విషయాన్ని గమనిస్తామని, అధికారుల పనితీరును అంచనా వేస్తామన్నారు. జిల్లాలో క్రీడాకారుల ఉన్నత భవిత కోసం కోడి రామ్మూర్తి స్టేడియం పనులకు రూ.10 కోట్లు నిధులు వెచ్చించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించి సీఎం ఓ ప్రకటన కూడా చేయనున్నారని, అందుకే అన్ని క్రీడా అసోసియేషన్లనూ సభకు రావాలని ధర్మాన పిలుపునిచ్చారు. సిఎం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు.