AP Teacher Salaries: ఏపీలో టీచర్ల వేతనాలు ఎప్పుడో చెప్పిన మంత్రి బొత్స, ఆలస్యంపై సైతం క్లారిటీ
AP Teacher Salaries: టీచర్ల వేతనాల ఆలస్యం వివాదంపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
AP Teacher Salaries:
నేడు (సెప్టెంబర్ 5న) టీచర్స్ డే సందర్భంగా ఏపీలో టీచర్ల వేతనాల ఆలస్యంపై విమర్శలు వస్తున్నాయి. టీచర్లకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనంటూ ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. టీచర్ల వేతనాల ఆలస్యం వివాదంపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో (Technical Reasons)తోనే రాష్ట్రంలో టీచర్ల వేతనాలు క్రెడిట్ కావడం ఆలస్యం అయిందన్నారు. సెప్టెంబర్ 7 లేదా 8వ తేదీల్లో ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని తెలిపారు.
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం రాష్ట్ర గురుపూజోత్సవం (Teachers Day) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి బొత్స సత్యనారాయణ హాజరై.. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. సాంకేతిక కారణాలతో ఏపీ టీచర్ల వేతనాలలో జాప్యం జరిగిందన్నారు. మరో రెండు ,మూడు రోజుల్లో టీచర్ల వేతనాలు క్రెడిట్ అవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటీశాఖ మంత్రి గడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో యూనివర్సిటీల్లో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రిక్రూట్ మెంట్ పై ఫోకస్ చేసిందన్నారు. ఈ క్రమంలో 3,200 పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే అన్ని వర్సిటీల్లో నియామకాల ప్రక్రియ చేపడతాం అన్నారు. టెన్త్ క్లాస్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఏపీలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ సైతం ఏపీలో పాఠశాలలు, పిల్లలకు ఇస్తున్న పుస్తకాలు, కల్పిస్తున్న సౌకర్యాలను ప్రశంసించారని మంత్రి బొత్స గుర్తుచేశారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు రావడం లేదని, సర్కార్ తమ కష్టాన్ని పట్టించుకోవడం లేదని పలు సందర్భాలలో ఉద్యోగులు వాపోయారు. తాజాగా టీచర్స్ డే సందర్బంగా వేతనాల సమస్య తెరమీదకి వచ్చింది. సాంకేతిక కారణాలతోనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.