Vizag Steel Plant: సీఎం జగన్ ఆ మాట చెబితే తెల్లారేసరికి జైల్లో ఉంటారు!: సీపీఐ నేత నారాయణ
ఏపీ సీఎం జగన్ కేంద్రానికి బానిసగా మారాడనీ.. అదానీకి అనుకూలంగా ఉండకపోతే ఆయన్ని జైల్లో పెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచనల వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం జగన్ కేంద్రానికి బానిసగా మారాడనీ.. అదానీకి అనుకూలంగా ఉండకపోతే ఆయన్ని జైల్లో పెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అదానీలకు ఏమాత్రం మద్దతు పలకకపోతే BJP నుంచి జగన్ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ నేను తీసుకుంటాను అని ఒక్కమాట చెప్పగలరా అని నారాయణ ప్రశ్నించారు. అలా చెప్పిన మరుసటి రోజే జగన్ జైల్లో ఉంటాడని అన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డింగ్‌కి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు నారాయణ. స్టీల్ ప్లాంట్ కొంటే నష్టం ఉండదన్న ఆయన.. ప్లాంటుకి 30 వేల ఎకరాల ల్యాండ్ ఉందని.. రూ.3 లక్షల కోట్లకు విలువైన ఆస్తి స్టీల్ ప్లాంట్ సొంతమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గౌతమ్ అదానీ ఎందుకు వస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. అదానీ రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంటును స్వాధీనం చేసుకుంటారు కానీ, నడిపించరు.. నష్టాలు చూపించి స్క్రాప్ లెక్కన అమ్మేస్తారని సంచలన ఆరోపణ చేశారు. 30,000 ఎకరాల స్థలాన్ని ఒక గ్రౌండ్ మాదిరిగా చేసి డంపింగ్‌కి వాడతారని చెప్పుకొచ్చారు. ఇతర దేశాలనుంచి వివిధ సరుకులను దిగుమతి చేసుకుని, ఆ స్థలాన్ని డంపింగుకి ఉపయోగిస్తారని అన్నారు నారాయణ.
కక్ష సాధింపు చర్యలో భాగంగానే జాతీయహోదా తొలగించారు
సీపీఐకి జాతీయ పార్టీ హోదాను ఎన్నికల కమిషన్ రద్దు చేయడంపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తమ పార్టీ అనేక పోరాటాలు చేసిందని.. భూస్వామ్య విధానానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిందని ఆయన గుర్తు చేశారు. దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వమనే సమైక్యవాదంతో ముందుకు వెళతామని అన్నారు. సాంకేతిక లెక్కలతో చూస్తున్నారు తప్ప.. దేశ చరిత్రలో సీపిఐ ప్రాముఖ్యత ఎంత ఉందనేది చూడటం లేదని నారాయణ విమర్శించారు. దేశంలోని 26 రాష్ట్రాల్లో సీపీఐ పార్టీ ఉందని.. ఈ చర్యతో ప్రభుత్వ దివాలాకోరుతనం బయటపడిందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తీరుపై కూడా గతంలో సుప్రీంకోర్టు కమిటీ వేసిందని.. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే నాలుగో స్థానంలో ఉన్న జూనియర్ ఎన్నికల కమిషనర్ గుజరాత్ కి చెందిన వ్యక్తి అని నారాయణ ఆరోపించారు.
సుప్రీంకోర్టు కూడా కమిషనర్లు ఇష్టం వచ్చినట్లు ఏ విధంగా పెడతారని కేంద్రప్రభుత్వాన్ని నిలదీసిందని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్‌ను నడిపించే పద్ధతుల్లో ఎన్నికల కమిషనర్లను, సిబిఐని మొత్తం వారే నడిపిస్తున్నారని నారాయణ ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే బిజెపి ఇటువంటి నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డారు. తమ పార్టీని ఎవరు అడ్డుకోలేరని.. ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. ఒక్కప్పుడు బీజేపీకి రెండు సీట్లు మాత్రేమే ఉన్నాయనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు నారాయణ. తమ పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. న్యాయపోరాటానికి బదులు రాజకీయ పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ పార్టీనీ అవమానపరిచే విధంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.