(Source: ECI/ABP News/ABP Majha)
Tiger Attack in Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో పులి సంచారం- దాడిలో రెండు ఆవులు మృతి
Tiger Attack in Manyam: పార్వతీపురం మన్యం జిల్లా మారయ్య పాడు గిరిజన గ్రామంలో శనివారం పెద్ద పులి ఆవులపైకి దాడికి దిగటంతో రెండు ఆవులు మృతిచెందాయి.
Tiger Attack in Manyam: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తాడిలోవ పంచాయతీ మారయ్యపాడు గిరిజన గ్రామంలో శనివారం పెద్ద పులి భయానక వాతావరణం సృష్టించింది. పులి ఆవులపైకి దాడికి దిగటంతో రెండు ఆవులు మృతిచెందాయి. పులి సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
పులి తిరుగుతోందన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరణించిన ఆవులను పరిశీలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలెవరూ ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. శుక్రవారం రోజు మక్కువ మండలం కన్నంపేట వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. ఆ ప్రదేశానికి 15 కి.మీ.ల దూరంలో నేడు ఈ ఘటన జరిగింది.
స్వేచ్ఛగా సంచరిస్తున్న పులులు
ఏపీలోని చాలా ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా పులులు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలను పులి సమస్య వెంటాడుతోంది.
గతంలో ఓసారి ఉమ్మడి విశాఖ జిల్లాల్లో రాయల్ బెంగాల్ టైగర్ సంచరించింది. చోడవరం సమీపంలోని కె.కోటపాడు రోడ్డులో సీమునపల్లి గ్రామంలో పెద్దపులి సంచారం ఒకరికి కనిపించింది. పక్కగ్రామం గుల్లిపల్లికి చెందిన కె.రమణ అనే వ్యక్తి తన బైకు మీద రాయపురాజుపేటకు వెళుతుండగా, సీమునపల్లె గ్రామం వద్ద పెద్దపులి రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించింది. దాంతో భయపడిన రమణ రాయపురాజు పేట బొడ్డేడ రామునాయుడుకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.
అలెర్ట్ అయిన పోలీసులు సీమునపల్లె సహా సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అలాగే చోడవరం సీఐ తాతారావు ,ఎస్సై విభూషణరావు, ఫారెస్ట్ అధికారులు అన్ని సమీప గ్రామాల్లోనూ మైక్ తో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. ఒంటరిగా ఎవరూ తిరగవద్దనీ, రాత్రిపూట పశువులను పాకల్లో కాకుండా.. ఇళ్లవద్దే కట్టెయ్యలంటూ సూచించారు. అలాగే పులికి సంబంధించిన ఏ వివరాలు తెలిసినా సరే వెంటనే పోలీసులకు గానీ, ఫారెస్ట్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
పులి పంజాకు బలవుతున్న పాడిపశువులు
పులి దెబ్బకు ఆవులు, గేదెలు వంటివి ప్రాణాలు కోల్పోతున్నాయి. పెద్దపులి చింతపాలెంలో ఓ ఎద్దును చంపింది. గంధవరంలో గేదెనూ, మేకలనూ చంపితిన్న తరువాత మూడు రోజులపాటు పులిజాడ కనపడలేదు. దాంతో ఆకలితో మళ్ళీ పులి వేటకు రావడం ఖాయం అని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టే ఆదివారం ఎద్దును చింతపాలెంలో చంపి తినేసింది. గంధవరంలో చంపిన గేదె కళేబరం కోసం పులి మళ్ళీ వచ్చినట్టే.. చింతపాలెంలో కూడా ఎద్దు కళేబరం కోసం వస్తుందని ఫారెస్ట్ సిబ్బంది భావించి ట్రాప్ సెట్ చేసారు. అయితే పులి ఆ వైపునకు రాకుండా చోడవరం సమీప గ్రామాలకు వెళ్లినట్టు తెలిసింది.
Also Read : Cheetah Extinction: ఏరికోరి ఆ చీతాలనే ఎందుకు తీసుకొచ్చారు? భారత్‌లో అవి ఎందుకు అంతరించాయి?
Also Read : PM Modi 72nd Birthday: కునో నేషనల్ పార్క్‌లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, కెమెరా పట్టి ఫోటోలు కూడా తీశారు