Vizag Google Data Center: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చకచచకా ఏర్పాట్లు! భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి నగదు జమ
Vizag Google Data Center: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో శనివారం నుంచి నగదును ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది.

Vizag Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఒప్పందం జరిగిన నెల రోజులు కాక ముందే భూసేకరణ పూర్తి చేస్తోంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని భావించే భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం పరిధిలో రైతులతో చర్చిస్తోంది. అన్నదాత డిమాండ్ మేరకు పరిహారం పెంచింది. అందుకే దాదాపు 60శాతానికిపైగా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మిగిలిన వారిని కూడా ఒప్పించేందుకు ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో నగదు శనివారం నుంచి జమ చేయనుంది ప్రభుత్వం
60 శాతం రైతులు అంగీకారం
ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఎలాంటి అడ్డంకులు లేకుండా గూగుల్ డేటా సెంటర్‌ను వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. అన్నింటి కంటే ముఖ్యమైన భూసేకరణ ముమ్మరంగా చేస్తోంది. తుర్లవాడలో మూడు వందల ఎకరాలకుపైగా గూగుల్ సంస్థకు ఇవ్వబోతోంది. ఈ ప్రక్రియను సాఫీగా సాగేందుకు రైతులు డిమాండ్‌ల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. వారు చెప్పినట్టుగా పరిహారం పెంచుతోంది. వారు చెప్పిన ఇతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెబుతోంది.
పరిహారం పెంపుతో మరింత మంది ఆసక్తి
ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. తర్వాత ఏపీఐఐసీ నుంచి గూగుల్‌కు భూములు కేటాయిస్తారు. ఇప్పటి వరకు సేకరణ గుర్తించిన భూముల్లో 204 ఎకరాల వరకు డీపట్టా, రికార్డుల్లోకి చేరని శివాయ్ జమేదార్ భూములు ఉన్నాయి. ఇందులో డీ పట్టా భూములకు ఇరవై లక్షల పరిహారం అందజేస్తారు. రికార్డుల్లో లేని భూములకు పది లక్షల పరిహారం ఇస్తారు. వీటితోపాటు పట్టాలు ఉన్న రైతులకు ఇరవై సెంట్ల భూమిని, మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా అదే ప్రాంతంలో కేటాయించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇంటి కోసం ఇచ్చే స్థలాన్ని ఐదు సెంట్లు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆలోచన చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
రైతులతో మాట్లాడిన గంటా
ఇప్పటికే భూములు ఇచ్చేందుకు అంగీకరించి పత్రాలు అందజేసిన రైతులకు శనివారం నుంచి జమ చేయనుంది ప్రభుత్వం. మిగతా రైతులను ఒప్పించేందుకు గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులతో కలిసి తర్లువాలో పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంకా వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన భూములకు పరిహారం పెంచాలని కూడా స్థానిక రైతులు డిమాండ్ చేశారు. వాటి గురించి కూడా ఆలోచిస్తామని గంటా మాట ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు దళారులు వచ్చి తమ భూములను భారీ రేటుకు కొంటామని చెబుతున్నారని అన్నారు. గతంలో కూడా చాలా మంది తమకు తెలియకుండానే తమ భూములు కాజేశారని వాపోయారు. వాటికి సంబంధించిన కేసులు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఏదైనా అనుమానం ఉంటే అధికారులతో మాట్లాడాలని గంటా చెప్పారు. మాయగాళ్ల సమాచారం పోలీసులకు ఇవ్వాలని, వారి పని ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు.





















