Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Srikakulam News: ఒకే ఫొటో సిక్కాలు రాజకీయాల్లో కలకలం రేపింది. ఆ ఫొటో ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. ఇంతకీ శ్రీకాకుళంలో ఏం జరుగుతోంది.
AP Elections 2024: శ్రీకాకుళం రాజకీయం రోజుకో రంగు మార్చుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో అంతుపట్టపడం లేదు. వర్షా కాలంలోని వాతావరణంలా అయిపోయింది సిక్కోలు రాజకీయాల పరిస్థితి. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే గందరోగళం ఉంది. టికెట్ ఆశించిన రాని వాళ్లంతా సైలెంట్‌గా కనిపిస్తున్నప్పటికీ గట్టిగానే కొట్టేలా ఉన్నారు. అందుకే స్పష్టమైన సంకేతాలు కూడా పంపిస్తున్నారు.
గుండ లక్ష్మీదేవి అసంతృప్తి
శ్రీకాకుళం జిల్లాలో రంగులు మారుతున్న రాజకీయ జాబితాలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానిది ప్రథమ స్థానం. ఇక్కడ వైసీపీ తరఫున మంత్రి ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి గొండు శంకర్ పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన గుండ లక్ష్మీదేవికి పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. ఆమెకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై గుండ ఫ్యామిలీని అభిమానించే వారంతాఫైర్ అయ్యారు. టీడీపీ ఫ్లెక్సీలు, చంద్రబాబు ఫొటోలు దహనం చేశారు.
సైలెంట్‌గా గుండ లక్ష్మీదేవి
టికెట్ తనకు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న లక్ష్మీదేవి వర్గీయులు తీరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధినాయకత్వం రంగంలోకి దిగి ఆమెతో చర్చలు జరిపారు. వాళ్లంతా సైలెంట్‌గా ఉంటున్నప్పటికీ ప్రస్తుత అభ్యర్థి శంకర్‌కు మాత్రం సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రచారంలో కూడా పాల్గొనడం లేదని మాట కూడా వినిపిస్తోంది.
కలకలం రేపిన ఫొటో
ఈ చర్చ జరుగుతుండగానే సిక్కోలు రాజకీయాల్లో ఓ ఫొటో కలకలం రేపుతోంది. ధర్మాన ప్రసాదరావును ఆశీర్వదిస్తున్న గుండ లక్ష్మీదేవి ఫొటో రెండు రోజులుగా సిక్కోలు రాజకీయాలను ఊపేస్తోంది. ఈ ఫొటో పాతదే అయినా కథ మాత్రం కొత్తదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఫొటో విడుదల వెనుక పెద్ద రాజకీయమే ఉందని టాక్ నడుస్తోంది.
లక్ష్మీదేవికి రెండు ఆఫర్లు
పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో గుండ లక్ష్మీదేవి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీన్ని సరిచేసేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఏ అవకాశాన్ని వదులుకోని వైసీపీ... ఇప్పుడు దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడ వేసిందట. అందులో భాగంగానే గుండ లక్ష్మీదేవిని పార్టీలోకి ధర్మాన వర్గం ఆహ్వానించారు. మంచి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పారు. కలిసి పని చేద్దామని కూడా చెప్పారట.
వైసీపీ ఆఫర్‌ను గుండ లక్ష్మీదేవి తిరస్కరించడంతో మరో ఆఫర్ కూడా ఇచ్చారట. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఖర్చు మొత్తం భరించేందుకు కూడా వైసీపీ అధినాయకత్వం ఓకే చెప్పిందట. వీటన్నింటినీ తిరస్కరించిన లక్ష్మీదేవి ఓ ఫేవర్ చేసేందుకు అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు. దశాబ్ధాలపాటు పార్టీకి సేవ చేశామని.... పదవులు కూడా వచ్చాయని... ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ మారి రాజకీయ జీవితంలో మచ్చ తెచ్చుకోలేమన్నారట. కేడర్‌ని కూడా గందరగోళంలో పడేయలేమని తప్పుడు సంకేతాలు ఇవ్వలేమని అన్నారు. ఇన్ని రోజులు పెంచుకుంటూ వచ్చిన ప్రతిష్టకు భంగ వాటిల్లుతందని అన్నారట. అయితే టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీకి మాత్రం కచ్చితంగా గుణపాఠం చెబుతామన్నారు.
హింట్ ఇచ్చేశారా?
శ్రీకాకుళంలో ఎవరికి ఓటు వేయాలనేది శ్రేణుల ఇష్టమని... ఎవరిపై కూడా బలవంతంగా తమ అభిప్రాయాన్ని రుద్దబోమన్నారు గుండ లక్ష్మీదేవి. కానీ ఎవరికి ఓటు వేయాలో మాత్రం హింట్ ఇస్తామని స్పష్టంగా చెప్పేశారు. అందులో భాగంగానే ఈ ఫొటో విడుదల చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పుడు ఈ ఫొటో సిక్కోలులో చాలా చర్చకు దారిస్తోంది. ఇవే ఆఖరి ఎన్నికలు అంటూ ప్రచారం చేసుకుంటున్న ధర్మాన ప్రసాదరావుకు ఇది చాలా ఊపిరి పీల్చుకునే పరిణామం అంటున్నాయి వైసీపీ వర్గాలు. అటు టీడీపీ శ్రేణులు కూడా జరుగుతున్న మార్పులతో అలెర్ట్ అయినట్టు సమాచారం. ఎలాగైన గుండ లక్ష్మీదేవితో ప్రచారం చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.