CI Swarna Latha Story : రాజకీయ నేతల అండదండలతోనే సీఐ స్వర్ణలత లీలలు - సింపుల్‌గా బయటపడిపోతారా ?
మహిళా సీఐ స్వర్ణలత రాజకీయ అండదండలతోనే చెలరేగిపోయేవారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆమెపై కఠిన చర్యలు తీసుకోకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.
CI Swarna Latha Story : విశాఖపట్నంలో వ్యక్తుల్ని భయపెట్టి డబ్బుల్ని దోచుకున్న ముఠాకు సీఐ స్వర్ణలత నేతృత్వం వహించినట్లుగా స్పష్టం కావడం పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆమెకు ఉన్న రాజకీయ సంబంధాలు, పోలీసు అధికారుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా ఉంటూ చేసిన ఘన కార్యాలపై పోలీసు శాఖలోనే అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాజకీయ నేతల ఆశీస్సులు, ప్రభుత్వ మెప్పు కోసం ఆమె .. రాజకీయ ప్రకటనలు కూడా చేసిన సందర్భాలు ఉండటంతో ... సీఐ స్వర్ణలత గత నిర్వాకాలపై సోషల్ మీడియాపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఎస్పీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి అయ్యన్న పాత్రుడిపైనే విమర్శలు చేసిన సీఐ స్వర్ణలత
పోలీసులకు.. రాజకీయాలకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏం జరిగినా పోలీసులు జోక్యం చేసుకోకూడదు. కానీ నేరుగా కమిషనర్ ఆఫీసులోనే .. పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు హోదాలో ప్రెస్ మీట్ పెట్టిన స్వర్ణలత.. మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సంఘం పేరుతో స్పందించవచ్చు కానీ.. కమిషనర్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుల్ని .. విమర్శించడం.. సవాళ్లు చేయడం వివాదాస్పదమయింది. అయితే ఆమె ఇలా స్పందించడానికి కారణం .. ఆమెకు అండగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నేతల సూచనలేనని చెబుతారు.
కొంత మంది కీలక వైఎస్ఆర్‌సీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు !
విశాఖ కమిషనర్ కార్యాయయంలోనే సీఐ స్వర్ణలత చాలా కాలం పని చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచే పోలీసు పాలన జరుగుతుంది కాబట్టి..ఆమె తన పోస్టును అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని పోలీసు స్టేషన్ల విషయాల్లోనూ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలతో స్వర్ణలత మంచి సంబంధాలు కొనసాగించి.. సర్వీస్ పరంగా ఇబ్బందులు రాకుండా.. పోస్టింగ్‌ల లాబీయింగ్ కూడా చేస్తారని అంటున్నారు. ఆమె ఇలా బెదిరించి డబ్బులు దోపీడీ చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత .. విశాఖలో ఓ కీలక ప్రజాప్రతినిధి ఆమెపై కేసు పెట్టకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో సాధ్యం కాకపోవడంతో.. రాష్ట్ర స్థాయి కీలక నేతతోనూ ఫోన్ చేయించారంటున్నారు. కానీ విషయం బయటకు రావడంతో స్వర్ణలతపై కేసు పెట్టక తప్పలేదు.
స్వర్ణలతపై సీరియస్‌గా విచారణ చేయగలరా ?
సాధారణంగా పోలీసులు ఇలాంటి పనులు చేస్తే.. డిపార్టుమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. వెంటనే.. ఆమె ఇంతకు ముందు ఇలా ఎమైనా చేసిందేమో దర్యాప్తు చేస్తారు. కుుంబసభ్యులు, బంధువులు ఏమైనా అక్రమాస్తులు సంపాదించారేమో చూస్తారు. ఏసీబీ మొత్తం.. ఆ పోలీసు అధికారి వ్యవహారాలన్నింటనీ బయటకు తీస్తుంది. అయితే ఇక్కడ సీఐ స్వర్ణలతపై తప్పని సరి పరిస్థితుల్లో..అదీ కూడా బయట కు తెలిసిందన్న కారణంగా కేసు పెట్టారని.. అందుకే ఆమె ను ఏ 4గా పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అంత సీరియస్ చర్యలేమీ ఉండవన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తవుతున్నాయి. కంచే చేను మేస్తే.. ఇక ప్రజలకు ఎవరికి చెప్పుకుంటారు ? ఇలాంటి అధికారుల్ని కఠినంగా శిక్షిస్తేనే.. వ్యవస్థపై ప్రజలకు భరోసా ఉంటుందని లేకపోతే నమ్మకం కోల్పోతారన్న అభిప్రాయాలు సామాన్యుల నుంచి వస్తున్నాయి.