Srikakulam News: అరుదైన షార్క్ చిక్కింది నష్టాన్ని మిగిల్చింది, బోరుమంటున్న మత్స్యకారుడు
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. పంట పండిందని అనుకున్న వాళ్లంతా లోలోపల సంబర పడిపోయారు. తీర ఒడ్డుకు వచ్చి చూస్తే షాక్ తిన్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మధురవాడ పంచాయతీ పరిధిలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు పులి మొఖం సొర చేప చిక్కింది. వల బరువుగా రావడంతో భారీగా చేపలు పడి ఉంటాయని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తీరా ఒడ్డుకు చేరేసరికి నిరాశ చెందారు. వలలో ఉన్న చేపలను కూడా ఈ సొరచేప తినేసింది. చిందర వందరగా చేసింది.
మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడి వలకు చిక్కింది ఈ భారీ చేప. ఈ పులిమొఖం సొరచేప సుమారు ఐదువందల కిలోలకుపైగా బరువుంటుందని చెప్పారు మత్స్యకారులు. ఈ చేప వలలో పడటం, పెనుగులాటతో సుమారు 20 వేల రూపాయల విలువైన వల చిరిగిపోయింది. వలలోని చేపలను కూడా సొర తినేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఒడ్డుకు చేర్చిన సొరచేపను మత్స్యకారులు చంపకుండా తిరిగి సముద్రంలోకి అతి కష్టంమీద చేర్చారు. ఇది వేల్ షార్క్ అని.. అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని టెక్కలి అటవీశాఖ రేంజ్ అధికారి తెలిపారు. ఈ చేప సుమారు 15 అడుగుల పొడవు, 600కిలోల బరువు ఉంటుందన్నారు. అంతరించి పోతున్న వేల్ షార్క్ జాతికి చెందిన ఈ సోర చేపను వేటాడినా, తిన్నా 1972 వన్యప్రాణి చట్టంపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.