Krishnamachari Srikanth: యువ క్రికెటర్లకు ఏపీఎల్ మంచి వేదిక, ఏసీఏ పనితీరు అద్భుతం: 1983 ప్రపంచ కప్ హీరో శ్రీకాంత్
Andhra Premier League Season 2 Winner: ఆంధ్రలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లకు ప్రోత్సాహం కోసం ఏపీఎల్ ఉపయోగ పడుతుందని 1983 ప్రపంచ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు.
Andhra Premier League Season 2 Winner:
విశాఖపట్నం: ఆంధ్రలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, అలాంటి వారి ప్రోత్సాహం కోసం ఏపీఎల్ ఉపయోగ పడుతుందని 1983 ప్రపంచ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఆంధ్ర క్రికెట్ పని తీరు అద్భుతం అని ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రా రెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి లను ఇండియా టెస్ట్ కెప్టెన్, బిసిసిఐ మాజీ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ ప్రశంసించారు.
ఆంధ్రలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు..
విశాఖలోని డా. వైయస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, అంతర్జాతీయ ప్లేయర్ కె. ఎఎస్. భరత్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఆంధ్రలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారని కితాబిచ్చారు. వారికి ఏపీఎల్ మంచి వేదికగా ఉపయోగ పడుతుందని అన్నారు. రాబోవు రోజుల్లో ఆంధ్ర నుంచి మరింత మందిని దేశానికి ప్రాతనిధ్యం వహించే క్రికెటర్లను తయారు చేయాలని ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులకు కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. ఆంధ్రలో యువ క్రికెటర్ల ప్రతిభకు కొదవ లేదని ఆన్నారు. యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించేందుకు ఏపీఎల్ మంచి వేదిక అని అన్నారు. దీని ద్వారా జాతీయ స్థాయిలో ఆడేందుకు ఏంతో మందిని తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
ఏపీఎల్ కు ఆదరణ పెరిగింది..
క్రీడాకారుల్లో నైపణ్యాభివృద్ధి కోసం వైజాగ్ స్టేడియాన్ని ఏంతో అభివృద్ధి చేశారని అభినందించారు. ప్లైట్ లో వచ్చేటప్పుడు కొందరు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలని సూచించడంతో అక్కడకు వెళ్లేందుకు తన ప్రోగ్రాంలో లేకపోయినా వెళ్లి స్వామిని దర్శించుకున్నాని వెల్లడించారు. ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన ఏపీఎల్ -1 కు బాగా ఆదరణ పెరిగిందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీఎల్ -2 కు మరింత ఆదరణ వచ్చిందని అన్నారు. అంతకు ముందు ఆంధ్ర క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావ్ పేరుతో విశాఖ స్టేడియంలో ఓ స్టాండ్ ను మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, ఆపెక్స్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎల్ 2 విజేత రాయలసీమ కింగ్స్..
Andhra Premier League Season 2 Winner: రాయలసీమ కింగ్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా అవతరించింది. కోస్టల్ రైడర్స్ పై ఆదివారం ఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నంలోని వైయస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఆదివారం కోస్టల్ రైడర్స్ తో రాయలసీమ కింగ్స్ తలపడింది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న రాయలసీమ ప్రత్యర్థి కింగ్స్ కోస్టల్ రైడర్స్ ను 155 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్ ధరణి కుమార్ 30 పరుగులతో రైడర్స్ బ్యాటర్లలో టాప్ స్కోరర్. కింగ్స్ బౌలర్లలో షేక్ కలీముద్దీన్ మూడు వికెట్లు, హరీష్ శంకర్ రెడ్డి 2 వికెట్లు తీశారు. కెప్టెన్ హనుమ విహారి, జాగర్లపూడి రామ్, బోదాల వినయ్ తలా ఒక వికెట్ తీశారు.
రాయలసీమ కింగ్స్ కు ఓపెనర్ తోట శ్రావణ్ 24 పరుగులు చేయగా, కెప్టెన్ హనుమ విహారి 29 బంతుల్లోనే 46 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బోదాల కుమార్ 53 పరుగులతో రాణించాడు. చివర్లో గిరినాథ్ రెడ్డి 17 బంతుల్లో 29 రన్స్ చేశాడు. వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. వి.జయదేవన్ సిస్టం పద్ధతి ద్వారా రాయలసీమ కింగ్స్ ను విజేతగా ప్రకటించారు. వరుసగా 2వ టైటిల్ కొట్టాలన్న డిఫెండింగ్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ కు నిరాశే ఎదురైంది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్..
కోస్టల్ రైడర్స్- 155/8 (18 ఓవర్లు) - Winner రాయలసీమ కింగ్స్- 160/5 (16.3 ఓవర్లు)