MP Vijayasai Reddy : టీడీపీ కొత్త ఆయుధం ఆక్వా రంగం, మార్కెట్ సంక్షోభాన్ని ప్రభుత్వంపై రుద్దుతున్నారు- ఎంపీ విజయసాయి రెడ్డి
MP Vijayasai Reddy : ప్రపంచ మార్కెట్లో సంక్షోభం వల్లే ఆక్వా రంగం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
MP Vijayasai Reddy : ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి టీడీపీకి కొత్త ఆయుధం ఆక్వారంగం అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆక్వా రంగం సమస్యకు ప్రపంచ మార్కెట్ పరిస్థితులే కారణమన్నారు. ఈ సమస్యలను ప్రతిపక్షాలు ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై తాజా దుష్ప్రచారానికి తెలుగుదేశం ఇప్పుడు ఆక్వాకల్చర్ రంగాన్ని ఆయుధంగా ఎంచుకుందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు. రొయ్యల సాగు రంగంలో భారీ స్థాయిలో లాభావకాశాలతో పాటు అనేక ఇబ్బందులకు ఆస్కారం ఉందని చెప్పారు.
ఈక్వడార్ తో తీవ్ర పోటీ
ఎగుమతులపై ఆధారపడిన ఆక్వారంగం ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. 2020 ఆరంభంలో కరోనా ప్రంపంచ వ్యాప్తంగా విజృభించడం అనేక పారిశ్రామిక రంగాలు, సాగు రంగాలతో పాటు రొయ్యల సాగు కూడా తీవ్ర సంక్షోభంలో పడిందని గుర్తుచేశారు. కొవిడ్–19 మహమ్మారి సద్దుమణిగిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ రంగం కోలుకోలేకపోయిందని చెప్పారు. అంతర్జాతీయ పరిమాణాల వల్ల రొయ్యల ఎగుమతి ధరలు బాగా పెరగడం, అనూహ్య స్థాయిలో తగ్గిపోవడం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది వేసవి నాటికి ఆక్వారంగం మరోసారి తీవ్ర సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు కనిపించాయన్నారు. రొయ్యల ఎగుమతుల విషయంలో లాటిన్ అమెరికా దేశమైన ఈక్వడార్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోందని చెప్పారు. ఏపీ నుంచి రొయ్యలు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే చైనా తన విధానం మార్చుకుందని వెళ్లడించారు. ఏపీ నుంచి రొయ్యల దిగుమతులను నిలిపివేయడంతో ఆక్వారంగం మరోసారి సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని చెప్పారు.
ఎగుమతి మార్కెట్లో ఒడిదొడుకులు
ఎగుమతి మార్కెట్లో రొయ్యల ధర పతనమైందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. రొయ్యల పెంపకానికి తాత్వాలికంగా స్వస్తి పలకాలనే ఆలోచన ఆక్వా రైతులకు ఏడాది జూన్–జులై మాసాల్లోనే వచ్చిందన్నారు. చైనాకు ఎగుమతులు ఆగిపోవడం, రొయ్యల మేత సరఫరాలో సమస్యలు వంటి అనేక ఇబ్బందులు ఆక్వా రంగాన్ని కుంగదీస్తున్నాయని తెలిపారు. అయినా సీఎం జగన్ ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఆక్వారంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. చేపలు, రొయ్యల సాగులో నష్టాలు, ఇబ్బందులు నివారించడానికి ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా సిద్ధమౌతోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ నెల 18న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారన్నారు. అదే రోజు రూ.13.58 కోట్ల వ్యయంతో నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద నిర్మించే ఫిషింగ్ హార్బర్‌కు కూడా శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు.
ఆక్వా రంగంలో ఊహించని ఇబ్బందులు
ఆక్వారంగం చాలా వరకు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నియంత్రణలో ఉంటుందని ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి తనకు చేతనైనన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. భారీ పెట్టుబడులతోపాటు ఊహించని ఇబ్బందులు ఎదురయ్యే రొయ్యల పెంపకం రంగంలోని సమస్యల పరిష్కారంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించిందన్నారు. ఆక్వా యూనివర్సిటీ స్థాపన, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వంటి మౌలిక సౌకర్యాలను పెంచడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని స్పష్టం చేశారు. ఆక్వారంగంలో ప్రస్తుత సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నట్టు టీడీపీ మాట్లాడడం నిరాధార ఆరోపణ మాత్రమేనన్నారు. ఆక్వా రైతులకు తమ కళ్ల ముందు పరిస్థితులపై అవగాహన ఉన్నందున టీడీపీ నేతల అబద్ధాలను నమ్మేవారు లేరని విజయసాయిరెడ్డి అన్నారు.