TDP on Visakha Garjana : విశాఖ గర్జన బలవంతపు గర్జన, ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డికి ధారాదత్తం- టీడీపీ నేతలు
TDP on Visakha Garjana : ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సేవ్ ఆంధ్రా పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ గర్జన బలవంతపు గర్జన అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.
TDP on Visakha Garjana : విశాఖ టీడీపీ కార్యాలయంలో సేవ్ ఆంధ్రా పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు రౌండ్ టేబుల్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, సృజయ కృష్ణ రంగారావు, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వెలగపూడి, గణబాబు, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రూ.40 వేల కోట్ల ఆస్తులు కొట్టేశారు-అయ్యన్నపాత్రుడు
ఈ సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ప్రజలు ఏడుస్తుంటే జగన్ నవ్వుకుంటారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు రూ.40 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కొట్టేశారని ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను వేల కోట్లకు తాకట్టు పెట్టేశారన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అమరావతి రాజధానని జగన్ చెప్పారన్నారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారన్నారు. చంద్రబాబు అప్పుడే చెప్పారు ఏపీకి రాజధాని అమరావతి అని, ఆర్థిక రాజధాని విశాఖ అన్నారన్నారు. ప్రపంచంలో ఒక్క సౌత్ ఆఫ్రికా తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవన్నారు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక రాజధాని చెయ్యాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి వ్యక్తి ఆదాయం పెరిగిందని, జగన్ హయాంలో ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించారు. విశాఖలోని రామానాయుడు స్టూడియో కూడా కొట్టేశారని, రుషికొండ బీచ్ ప్రైవేట్ పరం చేసేశారని ఆరోపించారు.
బలవంతపు గర్జన
"విశాఖలో వైసీపీ ప్రభుత్వానికి భయపడి పరిశ్రమలు తరలిపోతున్నాయి. ధర్మశ్రీ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు రాజీనామా చేయలేదు. ఇవాళ గర్జన బలవంతపు గర్జన. గర్జన కోసం నీటి కుళాయిలు కట్టేశారు. బలవంతంగా స్కూల్స్ మూసేశారు. విశాఖ డెయిరీ పాలకేంద్రాలకు నోటీసులు ఇచ్చారు. అమరావతి రైతులు ఏం తప్పు చేశారు. వారిని ఓదార్చాల్సిన వారు కక్ష కట్టారు."- అయ్యన్న పాత్రుడు
విజయసాయి రెడ్డి కేంద్రీకరణ
వికేంద్రీకరణ విజయసాయిరెడ్డి కేంద్రీకరణగా మారిందని వంగలపూడి అనిత ఆరోపించారు. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మాయ చేస్తుందన్నారు. గర్జన పెట్టినోళ్లకి సిగ్గుండాలన్నారు. అమరావతి మహిళా రైతులకు హేట్సాప్ చెబుతున్నానన్నారు. తన అన్న ఇక్కడే ఉంటారని జబర్దస్త్ రోజా అన్నారని, అమరావతి మహిళా రైతులకు గర్భం వస్తుందని ప్రేలాపనలు పేలుతున్నారన్నారు. రైతుల కాళ్లు విరగగొడతానన్న ఎమ్మెల్యే కాలు విరిగి ఇంట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రైతుల పాదయాత్రతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఉలికిపడుతున్నారన్నారు.
ఫొటోల కోసం వైసీపీ నేతల పాకులాట-ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు రైల్వే జోన్ గురించి మాట్లాడడం లేదు. స్పెషల్ స్టేటస్ గురించి జగన్ ఎందుకు పోరాటాo చెయ్యడం లేదు. ఇప్పుడు ఏర్పడ్డ జేఏసీ స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు జగన్ ను అడగడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా అంటున్నారు రాజీనామాలు ఎలా చెయ్యాలో నేను చెప్తా చెయ్యండి. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎందుకు అడగడం లేదు. ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఏ విధంగా న్యాయం చేస్తారు. ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలి. అమరావతిలో రాజధాని 29 గ్రామాలకే పరిమితం అంటున్నారు. మరి విశాఖలో పెడితే ఎన్ని ఊర్లకు విస్తరిస్తారో చెప్పాలి. స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు రాజీనామాలు చేయలేదు. వెనుకబడిన నిధుల కోసం ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడరు
వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఫొటోల కోసం పాకులాడుతున్నారు. విశాఖను ల్యాండ్ గ్రాబింగ్ సిటీగా మార్చేశారు. ఉత్తరాంధ్ర అంతా విజయసాయిరెడ్డికి అప్పగించేశారు. విశాఖను విజయసాయిరెడ్డి నగరంగా మార్చేశారు. విశాఖలో ఎంపీలు దోచుకున్న భూముల కోసం ఒకరిపై మరొకరు ఆరోపించుకుంటున్నారు. విశాఖ రాజధాని అయితే 151 మంది భూ బకాసురులుగా దిగుతారు. "- ఎంపీ రామ్మోహన్ నాయుడు
విశాఖ ఆర్థిక రాజధాని
"జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి. అభివృద్ధి, సంక్షేమం సమానంగా అన్ని జిల్లాలకు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఒక్క అవకాశం అని చెప్పి జగన్ అధికారo లోకి వచ్చారు. కానీ జగన్ ప్రజల్ని మోసం చేశారు. ఏపీ ప్రజలు మళ్లీ మోసపోరు. పనికిమాలిన మంత్రుల్లారా ఎన్టీఆర్ పరిపాలన వికేంద్రీకరణకు ఆద్యుడు అని గుర్తుంచుకోవాలి. ప్రజలకు వద్దకు పాలనను తీసుకొచ్చింది చంద్రబాబు. అయిదు కోట్లమంది మెచ్చిన రాజధాని అమరావతి. జగన్ తో సహా అన్ని పార్టీలు అమరావతికి ఆమోదించారు. జగన్ దేశంలోనే అత్యంత అవినీతిపరుడన్నది మంత్రి ధర్మాన. మంత్రి పదవి రాగానే ధర్మాన మాట మార్చేశారు. మూడు రాజధానులపై హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. విశాఖను విధ్వంసం చేయడానికి జేఏసీ పెట్టారు. జగన్ బంధువు చీఫ్ ఇంజినీర్ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఖర్చు చేసింది చంద్రబాబేనని వాస్తవం చెప్పారు. రాజధాని కాకపోయినా విశాఖ అభివృద్ధి చెందుతుంది. మూడు ముక్కలాడితే ప్రాంతాలు అభివృద్ధి చెందవు. ఋషికొండ ను బోడిగుండు చేసేశారు. విశాఖలో అన్ని ఆస్తులను కొల్లగొట్టారు."-అచ్చె్న్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
విశాఖ గర్జన కౌరవుల సభ
"విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రను ధారాదత్తం చేశారు. గుడివాడ అమర్నాధ్-విసారెడ్డి కలిసి విసన్న పేటలో 600 ఎకరాలు కొట్టేశారు. మహానుభావుడు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై నిందలు వేశారు. నిందలు వేసినవారికి ప్రజలు పోస్ట్ మార్టం చేస్తారు. టీడీపీ రౌండ్ టేబుల్ మీట్ పాండవుల సభ అయితే గర్జన పేరుతో చేసింది కౌరవుల సభ. కౌరవుల సభలో జబర్దస్త్ రోజా ఫెరామర్మన్స్ చేశారు. ఇవాళ పాండవుల సభ సక్సెస్ అయ్యింది. ప్రజా రాజధానికి రాష్ట్రం అంతా మద్దతు పలుకుతుంది."- బుద్ధా వెంకన్న