Presidential Fleet Review: విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, సర్వ సైన్యాధ్యక్షుడి ముందు నౌకదళ శక్తి సామర్థ్యాలు ప్రదర్శన
విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. మిలన్-2022 పేరుతో నిర్వహిస్తున్న ఫ్లీట్ రివ్యూలో నౌకదళం తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించింది.
విశాఖలో నేవీ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కళ్లు చెదిరే విన్యాసాలతో అదరదహో అన్న రీతిలో జరిగింది. ఫ్లీట్ రివ్యూ ద్వారా మరోసారి భారత నౌకాదళం తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన యుద్ద నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు ఫ్లీట్ రివ్యూ ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖ వేదికగా నిలుస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఫ్లీట్ రివ్యూ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సుమిత్రలో పయనించారు. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు.
President Ram Nath Kovind witnessed the Fleet Review 2022 at Visakhapatnam, Andhra Pradesh today.
— President of India (@rashtrapatibhvn) February 21, 2022
Details: https://t.co/nUT0eLAnwZ pic.twitter.com/g1LKaqJZir
భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు గౌరవ వందనం చేశాయి. 60 యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్స్, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. ఫ్లీట్ రివ్యూలో నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నౌకా దళ తీర పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి కోవింద్ బంగాళాఖాతంలో నాలుగు నిలువు వరుసలలో లంగరు వేసిన 44 నౌకలను దాటుకుని గౌరవ వందనం స్వీకరించారు.
సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖలో జరుగుతున్న ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణించిన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందు వెనుక పైలెట్ నౌకలు ప్రయాణించాయి. ఈ విన్యాసాల్లో 10 వేలకు పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయం. ఈసారి ఫ్లీట్ రివ్యూను మిలన్-2022 పేరుతో నిర్వహిస్తున్నారు. నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, జాతీయ ఓషణోగ్రఫీ నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు పాల్గొన్నాయి. సబ్ మెరీన్లు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో భాగమయ్యాయి.
Also Read: రాష్ట్రపతి సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్ఎస్ యుద్ధనౌక, ఫ్లీట్ రివ్యూ పూర్తి షెడ్యూల్