President Fleet Review 2022: రాష్ట్రపతి సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్ఎస్ యుద్ధనౌక, ఫ్లీట్ రివ్యూ పూర్తి షెడ్యూల్
దేశ నౌకదళ బలాన్ని సమీక్షించే కార్యక్రమం రాష్ట్రపతి ఫ్లీట్. నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫ్లీట్ రివ్యూ చేస్తారు.
విశాఖలో నేడు ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభం కానుంది. దేశ నౌకదళ బలాన్ని సమీక్షించే కార్యక్రమం రాష్ట్రపతి ఫ్లీట్. నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆర్ కె బీచ్ నుంచి తెన్నేటి పార్క్ వరకు సముద్ర తీరంలో ఫ్లీట్ రివ్యూ చేస్తారు. రాష్ట్రపతి తన ఐదేళ్ల పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ చేస్తారు. ఇది 12వ సమీక్ష, విశాఖలో మూడోది. 2016లో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షను కూడా విశాఖలోనే నిర్వహించారు.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, రక్షణ శాఖామంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్ర, అండమాన్, నికోబార్ల గవర్నర్లు, కేంద్ర సహాయ మంత్రులు పురుషోత్తం రూపాల, చౌహన్ నిన్ననే విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రయాణిస్తూ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాంనాథ్ కోవింద్ నావికాదళ సమీక్ష నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11:45 వరకూ జరిగే ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో నేవీతో పాటు కోస్ట్‌గార్డ్ కు చెందిన 60 నౌకలతో పాటు సబ్ మెరైన్లు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటాయి.
ఈ కార్యక్రమానంతరం తపాలా బిళ్లని, పోస్టల్ కవర్‌ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 25వ తేదీ నుంచి మిలాన్ 2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి. మార్చి 4 వరకు జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. 55 నావల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఫ్లైపాస్ట్, సబ్‌మెరైన్ & షిప్ ఫార్మేషన్ స్టీమ్ పాస్ట్, ఎలైట్ మెరైన్ కమాండోస్ ద్వారా పారా జంప్‌లు, సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రదర్శన, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్ & ప్రఖ్యాత మదాయి సహా పడవ బోట్‌ల కవాతు ఉంటుంది.
ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ పూర్తి షెడ్యూల్..
సోమవారం ఉదయం 9 గంటలకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభం
9.07 గంటలకి ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
9.34 నుంచి 10. 43 గంటల వరకు యుద్ధ నౌకల సమీక్ష, పెరేడ్ సెయిల్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ డెమో, హాక్ డెమో సెషన్
10.44 నుంచి 10. 52 గంటల వరకు ఫ్లై ఫాస్ట్, ఏకకాలంలో సుప్రీం కమాండర్‌కు సెల్యూట్ చేయనున్న యుద్ధ విమానాలు, హెలీకాఫ్టర్లు
10.53 నుంచి 10.57 గంటల వరకు సబ్ మెరైన్‌లను సమీక్షిస్తారు
10.58 నుంచి 11.02 గంటల వరకు మెరైన్ కమాండోల విన్యాసాలు
11.08 నుంచి 11.13 వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం
నౌకాదళ అధికారులతో గ్రూప్ ఫొటో అనంతరం రాష్ట్రపతి తపాలా బిళ్ల, పోస్టల్ కవర్ ఆవిష్కరణ.
11.45 కి నిష్క్రమించనున్న రాష్ట్రపతి కోవింద్
ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే యుద్ధ నౌకలు
ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ దిల్లీ, ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి, ఐఎన్ఎస్ తేజ్, శివాలిక్ శ్రేణి యుద్ధనౌకలు మూడు, కమోర్తా యుద్ధనౌకలు మూడు, కోస్ట్‌గార్డ్, ఐఎన్ఓటీ, షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన నౌకలు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటాయి.
ఆదివారం విశాఖ చేరుకున్న రాష్ట్రపతి..
ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(President Ramnath Kovind) విశాఖ(Visakha)కు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వ భూషణ్, సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు. ఆదివారం విశాఖపట్నంలో నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగ(INS Dega)కు సాయంత్రం గంటలు 5.35 నిమిషాలకు ఆయన చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గవర్నర్(Governor) బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, శాసన సభాపతి తమ్మినేని సీతారాం, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తూర్పు నౌకాదళ కమాండ్, వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.