MP GVL On Rahul Gandhi : ఎస్సీ జాబితాలో దళిత క్రైస్తవులను చేర్చే తీర్మానం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే- ఎంపీ జీవీఎల్
MP GVL On Rahul Gandhi : ఒక వర్గాన్ని దొంగలుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దారుణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. కోర్టు చెప్పిన రాహుల్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోపోవడంతో జైలు శిక్షపడిందన్నారు.
MP GVL On Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వచ్చిన కోర్టు తీర్పును కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీపై గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు నోటి దురుసు, అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఒక బీసీ వర్గాన్ని దొంగలుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దారుణం అన్నారు. కోర్టు చెప్పినా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం, వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనందుకే కోర్టు జైలు శిక్ష వేసిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లో దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సిగ్గు చేటని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి చేసిన పార్టీలు ఇప్పుడు ఏకమయ్యాయన్నారు. సీబీఐ, ఈడీ దాడులు చేస్తుంటే తమ తప్పు లేదని చెప్పుకునే నైతికత కూడా ఆ పార్టీలకు లేదన్నారు. దిల్లీలో లిక్కర్ స్కాం, రైల్ స్కాంపై చర్యలు వద్దని కొన్ని పార్టీలు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు.
దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం- జీవీఎల్
ఏపీ అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి వైసీపీ ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎంపీ జీవీఎల్ అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగిందని గుర్తు చేశారు. మతం మారితే కుల ఆధారిత రిజర్వేషన్ ఎలా పొందుతారని ఆయన ప్రశ్నించారు. దీంతో నిజమైన దళితులకి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారని తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందన్నారు. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ హోదా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. క్రిస్టియన్, ముస్లిం మతాలకు ఎస్సీ హోదా ఇవ్వడం కుదరదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దౌర్భాగ్యం అన్నారు.
రాహుల్ గాంధీ అహంకారానికి నిదర్శనం
భోజ్ పురీ హీరో, ఢిల్లీ ఉత్తర తూర్పు ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ... తాను గతంలో బీజేపీ దిల్లీ అధ్యక్షునిగా పని చేశాను అని గుర్తు చేశారు. విశాఖలో ఎంపీ జీవీఎల్ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నానన్నారు. విశాఖను మినీ ఇండియాగా అభివర్ణించారు మనోజ్ తివారీ. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు సమృద్ధిగా ఇస్తుందన్నారు. రాహుల్ గాంధీ దేశం నాశనానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుందన్న ఆయన... ప్రధాని కులాన్ని కించపర్చిన రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష వేసిందని గుర్తుచేశారు. రాహుల్ ఆలోచన విధానాన్ని ప్రతి భారతీయుడు వ్యతిరేకిస్తారన్నారు. కోర్టు చెప్పినా క్షమాపణ చెప్పకపోవడం రాహుల్ గాంధీ అహంకారానికి నిదర్శనం అన్నారు. జీ 20 సమావేశాలు విశాఖలో కూడా జరగనున్నాయని తెలిపారు. తాను విశాఖలో సినిమా తారల క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి విశాఖ వచ్చానని తెలిపారు. తెలుగు వారియర్స్ జట్టులో హీరో అఖిల్ మంచి వ్యక్తి అని కొనియాడారు. ఫైనల్ చేరిన తెలుగు వారియర్స్ జట్టుకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.