Mla Ganta Srinivasarao : మూడు రాజధానుల ప్రస్తావన లేకుండా గవర్నర్ స్పీచ్, ప్రభుత్వ నిర్ణయాల డొల్లతనానికి నిదర్శనం - గంటా శ్రీనివాసరావు
Mla Ganta Srinivasarao : గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావన చేయకపోవడం ప్రభుత్వ నిర్ణయాల డొల్లతనాన్ని బయటపెట్టాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు.
Mla Ganta Srinivasarao : గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ అస్తవ్యస్త పాలన, అనుభవ లేమి, అరాచకాలను కప్పి పుచ్చే ప్రయత్నం జరిగినట్టు కనిపించిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పి దాన్ని చట్టబద్ధం చేసుకునే ప్రయత్నంలా అనిపించిందని విమర్శించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకోకుండా నిరంతరం సజ్జల, బుగ్గన మాట్లాడే మాటలనే ఒక సంకలనంలా చేసి గవర్నర్ చేత మాట్లాడించారన్నారు. మూడు రాజధానుల అంశం ప్రస్తావన చేయకపోవడం ప్రభుత్వ నిర్ణయాల డొల్లతనాన్ని బహిర్గతం చేసిందన్నారు. గవర్నర్ ను స్పీకర్ ఛాంబర్ లో వేచిఉండేలా చేసి తమ నియంతృత్వాన్ని, లెక్కలేనితనాన్ని మరోసారి చాటుకున్నారని విమర్శించారు. మొత్తంగా గవర్నర్ కూడా తనను ఈ స్థాయికి దిగజారుస్తారని అనుకుని ఉంటే ఈ పదవి తీసుకుని ఉండేవారు కాదేమోనని అనిపించేలా వ్యవహరించారని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ అస్తవ్యస్త పాలన, అనుభవ లేమి, అరాచకాలను కప్పి పుచ్చే ప్రయత్నం జరిగినట్టు కనిపించింది. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పి దాన్ని చట్టబద్దం చేసుకునే ప్రయత్నంలా అనిపించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ ఇమేజ్ ను కూడా(1/3)
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 14, 2023
గవర్నర్ స్థాయి తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరించింది -పయ్యావుల
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు ప్రస్తావించలేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేకపోయిందన్నారు. గవర్నర్ స్థాయి తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రిని పొగిడించారని, ఇది ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా అని నిలదీశారు. ముఖ్యమంత్రి రాక కోసం గవర్నర్‌ను కూడా స్పీకర్ కార్యాలయంలో వెయిట్ చేయించారి ఆరోపించారు. శాంతి భద్రతల విషయంపై గవర్నర్ ప్రసంగంలో ఎందుకులేదని పయ్యావుల ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్‌తో చెప్పించే ప్రయత్నం చేశారన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్‌తోనూ ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు.
గవర్నర్ ప్రసంగం బాయ్ కాట్ చేసిన టీడీపీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా టీడీపీ సభ్యులు గందరగోళం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని పచ్చి అబద్ధాలే ఉన్నాయని నినాదాలు చేశారు. ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు. అసత్యాలు భరించలేకపోతున్నామని నినాదాలు చేశారు. చివరికి గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు బాయ్ కాట్ చేశారు.
చివరికి రాష్ట్ర గవర్నర్ చేత కూడా జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పించారు. అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంలో పోలవరంతో సహా ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా జరుగుతున్నట్టు జగన్ సర్కారు చెప్పించింది. దీన్ని ఖండిస్తూ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేసారు. pic.twitter.com/YB0nrtjpcO
— Telugu Desam Party (@JaiTDP) March 14, 2023