![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Minister Gudivada Amarnath : దేవుని పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్ర, ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్ర చేయాలనే కుట్ర- మంత్రి అమర్ నాథ్
Minister Gudivada Amarnath : హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా అని ఏదైనా చేస్తాం అనుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి అమర్ నాథ్ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర దెయ్యాల యాత్ర అని విమర్శించారు.
![Minister Gudivada Amarnath : దేవుని పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్ర, ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్ర చేయాలనే కుట్ర- మంత్రి అమర్ నాథ్ Visakhapatnam Minister Gudivada Amarnath criticizes Amaravati padayatra TDP Chief Chandrababu DNN Minister Gudivada Amarnath : దేవుని పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్ర, ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్ర చేయాలనే కుట్ర- మంత్రి అమర్ నాథ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/13/c3a9ec2fa7dcf10d41057a62e5c6385c1663081793374235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Gudivada Amarnath : అమరావతి ప్రాంత ప్రజలు చేపట్టిన పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకే అని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. దేవుని పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా ఆయన అభివర్ణించారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాగుతున్న ఈ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి చంద్రబాబు పూర్తిగా బాధ్యత వహించాలని మంత్రి మరోసారి హెచ్చరించారు. యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది కదా అని ఏదైనా చేస్తాం, ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకు వస్తే చూస్తూ సహించబోమని ఆయన చెప్పారు. అమరావతి మినహా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైసీపీ ప్రభుత్వం కోరుకోవడం లేదని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పం అన్నారు.
రాయలసీమ డిక్లరేషన్ లో
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన వికేంద్రీకరణ చేస్తోందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. యాత్రకు సంఘీభావం తెలిపిన వారిలో రేణుకాచౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, చలసాని శ్రీనివాస్ , పాతూరి నాగభూషణం, కామినేని శ్రీనివాస్ వంటి వారు ఉన్నారంటే ఈ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారన్నది అర్థమవుతోందని అమర్నాథ్ అన్నారు. కేవలం పెట్టుబడిదారుల కోసం మాత్రమే ఈ యాత్ర సాగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. 2018 ఫిబ్రవరి 23న బీజేపీ చేసిన రాయలసీమ డిక్లరేషన్ లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొన లేదా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ యాత్రకు కర్త-కర్మ-క్రియ అయిన చంద్రబాబు ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు వీరంతా ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడం లేదని అమర్నాథ్ సందేహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజలు సహించరు
మా ప్రాంతానికి వచ్చి, మా దేవుని మొక్కి మాకు కీడు జరగాలని చేస్తున్న ఈ యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు సహించబోమని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. తమకు అన్యాయం జరుగుతుందని భావించిన ఉత్తరాంధ్ర వాసులు ఈ యాత్ర పై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం వద్ద సమాచారం ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని అందుకోసమే మూడు రాజధానులు నిర్మాణం చేపట్టామని అమర్నాథ్ స్పష్టం చెప్పారు. 44 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారని ఆయన ప్రశ్నించారు. 1983 నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలు అండగా నిలిచారని, అటువంటి ఈ ప్రాంతానికి చంద్రబాబు ఎందుకు ద్రోహం చేయాలని భావిస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి మిగిలిన పార్టీలు చేస్తున్న కుట్రలను కూడా ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా ఈ పార్టీల నాయకులు అందరూ ఆయన ముందు ఎందుకు సాగిన పడుతున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు.
క్యాపిటలిస్టుల పాదయాత్ర
ఇది క్యాపిటలిస్టుల పాదయాత్రని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ గమనించారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. సీఎం జగన్ ను గద్దె దించడం, అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సంపాదించుకున్న లక్షల కోట్ల రూపాయలు పదిలంగా ఉంచుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోందని విమర్శించారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ చెప్పారు.. రాష్ట్రమంటే 29 గ్రామాల కాదోయ్.. రాష్ట్రమంటే 26 జిల్లాలోయ్ అని చంద్రబాబు గుర్తెరగాలి అని అమర్నాథ్ హితవు పలికారు. 2024 తో రాజధాని అంశానికి ముగింపు పడుతుందని అప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎన్నికలలో రిఫరెండమ్ అవుతాయని ఆ ఎన్నికల్లో తీర్పు వైసీపీకి అనుకూలంగానే వస్తుందన్నారు. విశాఖపట్నంలో పరిపాలనా భవనాలు నిర్మిస్తున్నారని ఒక పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ, విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదా? అని ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)