Asani Cyclone Effect : తీవ్ర తుపానుగా అసని, విశాఖకు విమాన సర్వీసులు రద్దు
Asani Cyclone Effect : అసని తుపాను తీవ్ర తుపానుగా మారి ఏపీ వైపు దూసుకోస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అసని తుపాను ప్రభావంతో విశాఖకు విమాన సర్వీసులు రద్దు చేశారు.
Asani Cyclone Effect : పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో అసని తీవ్ర తుపాను కొనసాగుతోంది. తుపాను ప్రస్తుతం ఏపీలోని విశాఖకు ఆగ్నేయంగా 390 కిమీ. పూరీకి దక్షిణంగా 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్యదిశగా పయనిస్తున్న అసని గంటకు 12 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వరకూ వాయవ్య దిశగా పయనించి, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రయాణిస్తున్నట్టు తెలిపింది. అక్కడ ఉత్తరకోస్తా- దక్షిణ ఒడిశా మధ్య కేంద్రీకృతమై తర్వాత ఉత్తర వాయవ్యంగా దిశగా మార్చుకునే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.
చేపల వేట నిషేధం
వచ్చే 24 గంటల్లో తుపానుగా బలహీనపడే సూచనలున్నాయని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలకు ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నట్టు తెలిపింది. సోమవారం అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, రాబోయే మూడు రోజులు సముద్రంలో చేపల వేటపై నిషేధాజ్ఞలు ఉన్నాయని విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది.
విమాన సర్వీసులు రద్దు
ప్రతికూల వాతావరణంతో విశాఖకు వచ్చే విమానాల సర్వీసులు రద్దు అయ్యాయి. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి. అలాగే విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్, ముంబయి, చెన్నై నుంచి వచ్చే ఇండిగో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు విశాఖ ఎయిర్ పోర్టు అధికారులు తెలియజేశారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారత వాతావరణ శాఖ జారీ చేసిన తుపాను హెచ్చరిక నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో విపత్తు అప్రమత్తత, నియంత్రణ చర్యలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ 08856 293104, ఇది 24 గంటలు, తుపాను ముప్పు ముగిసే వరకూ పని చేస్తుందని కలెక్టర్ తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో తుపాను సహాయ, రక్షణకు సంబంధించి వచ్చే కాల్స్ పై కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీములు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపడతామన్నారు. తుపాను పరిస్థితులను నిరంతరాయంగా గమనిస్తూ, అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు సముద్ర తీర మండలాల ప్రధాన కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.