Vijayanagaram Train accident: ఆ రైలు లేకుంటే పెను ప్రమాదమేనా? - వందల మంది ప్రాణాలు కాపాడిన మెమొ రైలు
Vijayanagaram Train accident: విశాఖ - విజయనగరం రైలు లేకుంటే విజయనగరం రైలు ప్రమాదంలో మరింత పెను విషాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. చాలా మంది ముందు వెళ్లిన ఈ రైలునే ఆశ్రయించినట్లు చెప్పారు.
విజయనగరం వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లు వెళ్లక ముందు విశాఖ - విజయనగరం ప్యాసింజర్ రైలును చాలామంది ఆశ్రయించడంతో పెను ప్రమాదం తప్పినట్లైందని అధికారులు చెబుతున్నారు. లేకుంటే పెను విషాదం జరిగేదని పేర్కొంటున్నారు.
ఈ 2 రైళ్లు కిటకిట
సాధారణ రోజుల్లో విశాఖ - రాయగడ, విశాఖ - పలాస ప్యాసింజర్ రైళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. వ్యాపారులు, స్థానికులు, ఏదైనా చిన్న చిన్న పనులపై ప్రయాణించే వారు తమ అవసరాల కోసం విశాఖకి ఉదయాన్నే వచ్చి, పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి ఈ రెండు రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అయితే, ఆదివారం మాత్రం అలా జరగలేదు. ఈ రైళ్ల కంటే ముందే ఓ రైలు వచ్చింది. ఈ రెండు రైళ్లలో ప్రయాణించాల్సిన వారు అంతా ఆ రైలును ఆశ్రయించారు.
ఆ ప్యాసింజర్ కాపాడింది
శని, ఆదివారాల్లో ఇదే రూట్ లో విశాఖ - విజయనగరం ప్యాసింజర్ రైలు ఉంటుంది. చాలామంది ఈ రైలుకే మొగ్గు చూపుతారు. ఆదివారం కూడా చాలా మంది ఈ రైలునే ఆశ్రయించారు. ఈ క్రమంలో పలాస, రాయగడ రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. ఒకవేళ ఈ రైలు లేకుంటే ప్రయాణికులంతా ఈ 2 రైళ్లనే ఆశ్రయించే వారని, అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పలాస, రాయగడ రైళ్లల్లో 1400 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. కంటకాపల్లి వద్ద ప్రమాదం జరగ్గా, పలాస ప్యాసింజర్ లో 4 బోగీలు, రాయగడ ప్యాసింజర్ లో 3 బోగీలు నుజ్జు నుజ్జుగా మారాయి.
విశాఖ నుంచి పలాస ప్యాసింజర్ బయలుదేరిన పావుగంట తర్వాత విశాఖ - రాయగడ ప్యాసింజర్ అదే ట్రాక్ పై వెళ్లింది. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ - పలాస రైలు ఆగగా, వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. అయితే, మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రాయగడ ప్యాసింజర్ సిగ్నల్ గమనించకుండా వేగంగా రావడంతోనే ఘోర ప్రమాదం సంభవించిందిని తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తులో వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. మరోవైపు, ప్రమాద స్థలంలో రైల్వే అధికారులు, సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్స్, యంత్రాల సాయంతో బోగీలను తొలగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఘటనా స్థలికి సీఎం
ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఘటనా స్థలానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో అలమండ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక రైలులో వెళ్లి ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు
ఈ ప్రమాదంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఈ క్రమంలో విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైళ్లు ఎప్పుడు వెళ్తాయో తెలియక స్టేషన్ లోనే పడిగాపులు కాస్తున్నారు.
Also Read: ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం - అధికారుల ప్రాథమిక నిర్ధారణ