Vijayanagaram Train accident: ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం - అధికారుల ప్రాథమిక నిర్ధారణ
Vijayanagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయి దర్యాప్తులో వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం కారణం కాదని స్పష్టం చేశారు. విశాఖ - రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ సిగ్నల్ గమనించకుండా వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని వెల్లడించారు. అయితే, ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టడమంటే రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని, అసలు ఆ రైలుకు సిగ్నల్ ఎవరిచ్చారనే నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ జరిగింది
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్ పై ఉన్న విశాఖ - పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖ - రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి పలాస ప్యాసింజర్ సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరగా, అదే ట్రాక్ పై రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. పలాస ప్యాసింజర్ కంటకాపల్లి - అలమండ వద్దకు రాగానే సిగ్నల్ కోసం నెమ్మదిగా వెళ్తూ 848 కి.మీ వద్ద ట్రాక్ పై నిలిచింది. ఆ సమయంలో వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడే మరో ట్రాక్ పై ఉన్న గూడ్స్ రైలుపైకి బోగీలు దూసుకెళ్లాయి. దీంతో కొన్ని బోగీలు నుజ్జు నుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ట్యాంకర్ గూడ్స్ పైకి పలాస రైలుకు చెందిన 2 బోగీలు వెళ్లడంతో పట్టాలు పైకి లేచి, దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లింది. విశాఖ - రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీలు పట్టాలు తప్పి పొలాల్లో పడిపోయాయి. దాని వెనుక ఉన్న డీ - 1 బోగీ వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను ఇంకా వెలికితీస్తున్నారు. పలాస, రాయగడ ప్యాసింజర్ రైలులో మొత్తం 1400 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Andhra Pradesh train accident: Latest ANI drone cam footage shows heavy cranes in action as restoration work is underway.
— ANI (@ANI) October 30, 2023
According to Vizianagaram SP, 13 people have died in the accident. pic.twitter.com/R8XXxOAY6J
అదే అంతిచిక్కని ప్రశ్న
విశాఖ నుంచి పలాస ప్యాసింజర్ ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుకనే రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. ఇంతలో విజయనగరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య కారణంగానే అది నెమ్మదిగా వెళ్లిందని, ఇంతలోనే రాయగడ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రయాణీకులు చెబుతున్నారు. ఒకే ట్రాక్ లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది అంతుపట్టడం లేదని ప్రమాదం జరిగిన రైల్లో ప్రయాణించిన ఓ రైల్వే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. తన 26 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదం ఇదే తొలిసారని చెప్పారు.
పాఠాలు నేర్వలేదా.?
ఈ ఏడాది జూన్ లో ఒడిశా, బాలాసోర్ జిల్లాలోని బహనగా స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో రైలు ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కోరమాండల్ బోగీలు పట్టాలు తప్పగా, ఆ పక్కనే ట్రాక్ పై వెళ్తున్న యశ్వంత్ పూర్ - హౌరా సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పగా, 275 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే సిగ్నల్ తప్పిదమే ప్రమాదానికి కారణంగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సరిగ్గా, విజయనగరం రైలు ప్రమాదం సమయంలోనే సేమ్ సీన్ రిపీట్ అయింది. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగిన పలాస ప్యాసింజర్ ను, రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టగా, పక్కన ఉన్న గూడ్స్ రైలుపైకి పట్టాలు దూసుకెళ్లాయి.
Also Read: రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి - ఇతర మృతుల వివరాలివే!