Visakha Land Issue : విశాఖలో వ్యాపారం మానేస్తానంటున్న ఎంపీ ఎంవీవీ - కబ్జా ఆరోపణలే చేయలేదంటున్న ఎస్పీ
Visakha Land Issue : విశాఖ ఎంపీ వర్సెస్ ఎస్పీ భూవివాదం కీలక మలుపు తిరిగింది. వీరిద్దరూ కలిసి ఇవాళ వివాద స్థలంలోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామని చెప్పుకొచ్చారు.
Visakha Land Issue : ఇకపై విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. తనపై వరుసగా వస్తున్న భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారి మధుకు చెందిన భూమిని కబ్జా చేశారని ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ వివరణ ఇచ్చారు. విశాఖ పీఎం పాలెంలోని సర్వే నెంబర్ 90/1పీ లో ఎస్పీ మధు తన స్నేహితులతో కలిసి 2016లో స్థలం కొన్నట్టు చెప్పారు. తాజాగా ఆ స్థలంలో గోడ కట్టడానికి ప్రయత్నించగా ఇది ఎంపీ స్థలమంటూ ఆయన అనుచరులు తనను అడ్డుకున్నారని, తన స్థలం కబ్జాకు గురైందంటూ విశాఖ నార్త్ ఏసీపీకి కంప్లైంట్ చేసారు మధు. తాను ఆరేళ్ల క్రితం కొన్న 531 గజాల స్థలంలో కొంత ప్రభుత్వ భూమి అని తెలియడంతో అప్పటికే మోసపోయానని తెలుసుకున్న తను తనకు భూమిని అమ్మని వ్యక్తులపై కేసు వేశానని, మిగిలిన 168 గజాలలో ఇల్లు కట్టుకుందామని వస్తే దానిలో ఎంపీ మనుషులు కల్వర్టు కట్టేశారని తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ పోలీసులను ఆశ్రయించిన ఘటన వైరల్ అయింది.
మధును వేరే వ్యక్తుల మోసం చేశారు
ఈ ఘటనపై వివరణ ఇవ్వడం కోసం వివాదాస్పద స్థలం వద్దే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాను చట్టప్రకారమే ల్యాండ్ కొన్నానంటూ చెప్పుకొచ్చారు. తన లే అవుట్ నుంచి వెళుతున్న మార్గాన్ని మూసివేసి, తన స్థలంలోనే వేరే దారి ఇచ్చానని ఆ దారిలో చిన్న కెనాల్ పై కల్వర్టు లాంటి నిర్మాణం చేశామని అయితే అది వేసిన స్థలం తనదని ఎస్పీ మధు అంటున్నారని ఎంపీ చెప్పారు. ఒకవేళ ఆ స్థలం తనదని ఎస్పీ మధు నిరూపిస్తే తప్పకుండా ఆ కల్వర్టును కూల్చేస్తానని ఎంపీ తెలిపారు. దారి వేసిన స్థలం తనదని చెప్పడానికి తన వద్ద అన్ని రుజువులు ఉన్నాయని ఎంపీ చెప్పారు. అర్ధరాత్రి గోడ కడుతున్న మధును ఎవరో కబ్జాదారుడు అనుకుని తన మనుసులు ఫోన్ చేయడంతో అడ్డుకున్నామని చెబుతున్న ఎంపీ, మధును వేరే వ్యక్తులు మోసం చేసి భూమిని అమ్మారని చెప్పుకొచ్చారు. తను కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు.
ఎంపీ కబ్జా చేశారని అనలేదు : ఇంటిలెజెన్స్ ఎస్పీ మధు
తన స్థలం కబ్జాకు గురైందని మొదట్లో ఆరోపించిన ఎస్పీ మధు ప్రస్తుతం ఎంపీ కబ్జా చేశారని అనలేదంటున్నారు. 531 గజాలను ప్రైవేటు భూమి అని తనకు వేరే వ్యక్తులు విక్రయించారని దానిలో అధికారులు 168 గజాలు మాత్రమే ప్రైవేటు భూమి అని నిర్ధారించడంతో తాను మోసపోయినట్టు గుర్తించాననీ, మిగిలిన 168 గజాలలో ఇల్లు కట్టుకుంటుంటే ఎంపీ మనుషులు అడ్డుకున్నారని మాత్రమే అన్నానని తెలిపారు. ఈ సమస్యపై తాము మాట్లాడుకున్నామని, ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిపారు. తన స్థలంలో తాను ఇల్లు కట్టుకోవాలన్నదే తన డిమాండ్ అని మధు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు.
ఇక విశాఖలో వ్యాపారం చేయను : ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
ఇకపై విశాఖలో తాను వ్యాపారం చేయనని అన్నారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తనపై ఎన్నడూ ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. ఎంపీ అయ్యాకే రాజకీయంగా తన ఎదుగుదల చూడలేక తనపై కొందరు వ్యక్తులు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అందుకే ఇకపై తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ఎంపీ చెప్పుకొచ్చారు.
రాత్రికి రాత్రే మారిన మాటలు
ఈ వ్యవహారం మొత్తంలో చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. మొన్న అంత ఆవేశంతో ఆరోపణలు చేసిన ఎస్పీ ఇప్పుడు ఎందుకు ఎంపీపై కబ్జా ఆరోపణలు చేయలేదు అంటున్నారు. పైగా అక్కడ అక్రమంగా నిర్మించారని తాను ఆరోపణలు చేసిన కల్వర్టు తీసేయడానికి ఎంపీ ఒప్పుకున్నారా అనేదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. పైగా ఎంపీతో కలిసి ప్రెస్ మీట్ కోసం ఎందుకు అంత హడావుడిగా వచ్చారు అన్నది తెలియడం లేదు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మాట్లాడుకున్నామని ఎంపీ చెబుతున్న దానినిబట్టి ఏదైనా సెటిల్మెంట్ లాంటిది జరిగి ఉంటుందా అనే అనుమానాలూ తెరపైకి వస్తున్నాయి అంటున్నారు ఈ వ్యవహారం గమనిస్తున్నవారు