(Source: ECI/ABP News/ABP Majha)
Visakha Capital Issue: ఉత్తరాంధ్రపై మీకున్న ప్రేమ ఏంటి?- వైసీపీ లీడర్లపై అచ్చెన్న ఆగ్రహం
Visakha Capital Issue: ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఈరోజు లేని ప్రేమను చూపిస్తూ ఇంకా మోసం చేయాలని చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
Visakha Capital Issue: కేవలం భూ కుంభకోణానికి, ప్రాంతీయ విద్వేషాలు పెంచడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కారని వివరించారు. ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ అనేది ఒక నటన మాత్రమే అని ఆయన కామెంట్ చేశారు. టెక్కలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మాన ప్రసాద్, తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానంటే ఉత్తరాంధ్ర మంత్రులకు మేము వద్దని చెప్పామా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
పరిశ్రమలు తెస్తామంటే వద్దన్నామా, ఇరిగేషన్ తెస్తామంటే కాదన్నామా.. అంటూ ధ్వజమెత్తారు. వారికి చేతకాక మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. గడిచిన 2014-2019 వరకు ఉత్తరాంధ్ర సాగు నీటి కోసం వివిధ ప్రాజెక్టులకు రూ.1600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.350 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. వంశధార రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తి చేస్తే.. మీరు ఒక్క శాతం పనులైన పూర్తి చేశారా అని వైసీపీ మంత్రులను ప్రశ్నించారు. తోటపల్లి ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. రూ.450 కోట్లతో ఆఫ్షోర్ తెస్తే వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తట్టెడు మట్టి అయినా వేయలేదని.. వారికి తమను విమర్శిం చే హక్కు కూడా లేదన్నారు. ఇచ్ఛాపురం బహుదా నదికి వంశధార, నాగావళి నుంచి కెనాల్ పనులకు రూ. ఐదు వేల కోట్లతో టెండర్‌కు తమ ప్రభుత్వ హయాంలో పిలిస్తే దాన్ని రద్దు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు.
భావనపాడు పోర్ట్ కోసం ఆనాడు ప్రజలను మమేకం చేసి శంకుస్థాపన చేద్దామన్న సమయంలో ఎన్నికలు రావడంతో అది అలాగే నిలిచిపోయిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోర్టును రద్దు చేసిందని గుర్తు చేశారు. పోర్టు అంటే ఒక పెద్ద ప్రాజెక్టు అని, దాన్ని టాయిలెట్ మార్చినట్లు మీ ఇష్టానుసారంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. భారీ ప్రాజెక్టు కూడా ఒక టాయిలెట్‌తో సమానంగా ఈ పాలకులకు ఉందని ఎద్దేవా చేశారు. పోర్టు కట్టే సమయంలో ప్రజలందరి అభిప్రాయాలు సేకరించాలని, ముఖ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, తన అభిప్రాయం కూడా తీసుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే భావనపాడు నుంచి మూలపేటకు పోర్టు మార్చారన్నారు. ఇంత జరుగుతున్నా తమ కార్యకర్తలు పోర్టు కోసం నోరు మెదపడం లేదని అడిగారు. అచ్చెన్న అభివృద్ధి కాంక్షించేవాడే కానీ అభివృద్ధిని అడ్డుకునేవాడు కాదని వివరించాడు. ఈ ప్రభుత్వం ఎలాగూ పోర్టు కట్టలేదని అది మళ్ళీ అచ్చెన్నాయుడు వచ్చాక కట్టాలని జోస్యం చెప్పారు. ప్రజల డిమాండ్లకు పోలీసులతో నిర్బంధంగా పోర్టు నిర్మించాలని చూస్తే అచ్చెన్నాయుడు ఊరుకోడని హెచ్చరించారు.
అక్రమాస్తుల కేసు అంటే సీఎం జగన్ కు వణుకు..
జగన్ కి సీబీఐ అంటే భయమని అలాగే అక్రమాస్తుల కేసు అటే మరింత భయమని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎక్కడ జైల్లో పెడతారని కేంద్రాన్ని చూసి భయపడుతున్నారని వ్యాఖ్యనించారు. మీకు మైక్ దొరికితే తిట్టడం, బూతు పురాణం విప్పడం అలవాటని విమర్శించారు. మీ కోసం మేము మాట్లాడితే మా స్థాయి తగ్గిపోతుందన్నారు. అంతకు ముందు టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నియోజకవర్గం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై చర్చిస్తు రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బరిలో ఉన్న అభ్యర్థిని పరిచయం చేశారు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దుర్మా ర్గపు ప్రభుత్వ పాలనలో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారని త్వరలోనే అందరికీ మంచిరోజులొస్తాయని కార్యకర్తలకు భరోసా కల్పించారు.