Ganesh Chaturthi 2024: మర్చిపోలేని... గుర్తుంచుకోలేని వినాయక చవితి- విజయవాడలో కళతప్పిన వేడుక
Vijayawada Floods: ప్రకృతి విపత్తుతో విజయవాడలో వినాయక చవిత సందడి కనిపించడం లేదు. ఎటు చూసిన ముంపు ప్రాంతాలు, బురదతో నిండిన ఇళ్లు కనిపిస్తున్నాయి.
Andhra Pradesh: వినాయక చవితి అంటే హిందువులకు తొలి పండుగ. అందుకే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ వేడుక చేసుకుంటారు. అయితే విజయవాడలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వారం రోజుల నుంచి వరద నీటిలో ఉంటున్న జనం వేడుకలను ఆనందంతో జరుపుకోవడం లేదు. నేటితరం ఎప్పుడూ చూడని వరద ఇంటిని, ఆస్తులను మింగేయడంతో విజయవాడలోని ప్రజలంతా విషాదంలో ఉన్నారు.
దేశమంతా ఆనందంతో చవితి వేడుకలు చేసుకుంటున్నారు. కానీ విజయవాడలో ఆ సందడి మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా ఉంటున్నప్పటికీ వారి కళ్లల్లో పండగ కాంతులు కనిపించడం లేదు. వారం రోజులు క్రితం కురిసిన కండపోత వర్షాలు, పోటెత్తిన బుడమేరు వాగుతో పరిస్థితి తారుమారైంది. అప్పటి వరకు వినాయక చవితి కోసం ఎన్నో ప్లాన్లు వేసిన వారంతా ఇప్పుడు ఉసూరుమంటున్నారు.
Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
గురువారం నాటికి కాస్త వరద ఉద్ధృతి శాంతించందని ఆనందపడేలోపు మరోసారి వరద ముంచెత్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పండగ సంతోషం కాస్తైనా ఉండటం లేదని బెజవాడ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లూ వాకిలి నిండా బురద నిండి ఉంది. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని బురద తొలగించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నా అవి ఇంకా నాలుగైదు రోజుల వరకు కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు.
వరదలు ముంచెత్తినప్పటి నుంచి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అనుక్షణం అధికారులను అప్రమత్తమంచేస్తున్నా ఇంకా సాయం అందని వారు ఉండనే ఉన్నారు. టెక్నాలజీ ఉపయోగించినా సాయం పూర్తి స్థాయిలో చేయలేనంద నష్టం వాటిల్లింది.
Also Read: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
అందుకే ఈ పండగను విజయవాడ వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగని గుర్తు పెట్టుకోలేరు కూడా. గతేడాది వీదికొక్క వినాయక మండపం దర్శనమిచ్చింది. ఇంటింటా చవితి సంబరాలు కనిపించాయి. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చవితి సందడి లేనే లేదు. ఏదో ముంపు బారిన పడని ప్రాంతాల్లో ఏదో రూపంలో చేసుకుంటున్నారు. ఇంకా నీటిలో ఉన్న వాళ్లు మాత్రం చివితికి దూరంగా ఉంటున్నారు. తొలి పండగ ఇలా జరుపుకోవడంతో ఎవరి మొహాల్లో కూడా ఆనందం కనిపించడం లేదు.