World Telugu Writers Conference: డిసెంబర్ 23, 24 తేదీలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
World Telugu Writers Conference 2022: ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యములో ఈ నెల 23, 24 తేదీలలో శుక్రవారం, శనివారాల్లో 5 వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు నిర్వహించనున్నారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను డిసెంబర్ 23, 24వ తేదీలలో నిర్వహించనున్నారు. స్వభాషను పరిరక్షించుకుందాం ‘ స్వాభిమానాన్ని పెంచుకుందాం...’ అనే నినాదంతో ఈ మహాసభలను శ్రీకారం చుట్టారు.
రెండు రోజులపాటు సభలు..
కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక సిద్ధార్ధ అకాడమి (విజయవాడ) సౌజన్యంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యములో ఈ నెల 23, 24 తేదీలలో శుక్రవారం, శనివారాల్లో 5 వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభ మాజీ ఉప సభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డా. జి.వి. పూర్ణచంద్, అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు వెల్లడిరచారు.
ప్రపంచ నలుమూలల నుంచి షుమారుగా 1500 మంది రచయితలు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చరిత్ర రంగాలపై వాణిజ్య సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తోందన్నారు. సామాజిక విలువలను కాపాడుతూ, భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక చేతనత్వాన్ని కలిగించటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తోందని వివరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ సభలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక-అమెరికా, సిలికానాంధ్ర, సిద్దార్ద అకాడెమీ మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకరిస్తున్నాయని వివరించారు.
రాజరాజ నరేంద్రుడి పేరు మీద...
మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుపడిన రాజరాజ నరేంద్రుడి పేరు పెట్టారు. ఆదికవి నన్నయ వేదికపై ప్రారంభ సభ, సమాప సభ, తెలుగు వెలుగుల సభ, ఇంకా ఇతర సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెలుగు అకాడెమీ నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన వ్యక్తి, తెలుగు టైపు రైటర్ల సృష్టికర్త, తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహరావు వేదిక పైన కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. తెలుగు భాషకు జాతీయ ఖ్యాతిని తెచ్చిన భాషాభిమాని, తెలుగు విశ్వవిద్యాలయ నిర్మాత యన్ టి రామారావు వేదికపై సాహితీ సదస్సులు జరుగుతాయని వివరించారు.
30 సదస్సులు... 800మంది ప్రతినిధులు
దేశ, విదేశాల నుండి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు మొత్తం 30 సదస్సులలో పాల్గొంటున్నారని వివరించారు. డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెలుగు వెలుగుల సభలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారు. పద్మశ్రీ గ్రహీతలు ఆచార్య కొలకలూరి ఇనాక్, అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతీ రామమోహనరావు, డా. గరికపాటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి, సినీనటులు సాయికుమార్, గేయ రచయితలు అందెశ్రీ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, సంగీతవేత్త స్వరవీణాపాణి పాల్గొంటున్నారు.
యువ అవధానులతో ‘‘కుదురాట - కొత్తవెలుగు’’, 10 మంది యువ గజల్ కవుల ముషాయిరా, 50 మందితో యువకవి సమ్మేళనం, 150 మందితో మహిళా కవిసమ్మేళనం, మోదుమూడి సుధాకర్, డాపప సప్పా దుర్గాప్రసాద్, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలు డా. ఎస్.పి. భారతి సోదాహరణ ప్రసంగాలు ఉంటాయి. కళారత్న కె.వి.సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్యరూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. మాతృభాష పరిరక్షణకు ప్రజాచైతన్యాన్ని కలిగించటానికి రచయితల పాత్రపై వివిధ సదస్సులలో చర్చలు జరుగనున్నాయని వివరించారు.