Vijayawada Traffic: విజయవాడ మీదుగా వెళ్తున్నారా? నగరంలోకి నో ఎంట్రీ - మళ్లింపులు ఇలా: పోలీసులు
విజయవాడ మీదుగా ప్రయాణాలు సాగించేవారిపై కూడా ఈ ఆంక్షల ప్రభావం పడనుంది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అందుకోసం విజయవాడలో భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. వేరే ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా ప్రయాణాలు సాగించేవారిపై కూడా ఈ ఆంక్షల ప్రభావం పడనుంది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ, మధ్య తరహా వాహనాలు మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం ప్రకటించారు. ప్రజల సౌకర్యం కోసం పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ రాత్రి నుంచి అక్టోబరు 5వ తేదీ రాత్రి వరకు వాహనాల దారి మళ్లింపు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
దారి మళ్లింపులు ఇలా..
* హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను విజయవాడ నగరంలోకి రాకుండానే దారి మళ్లించనున్నారు. ఇందుకోసం ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా దారి మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి ఇబ్రహీంపట్నం మార్గం మీదుగా మళ్లిస్తారు.
* విశాఖపట్నం - చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ రోడ్డు మీదుగా గుడివాడ, పామర్రు, బాపట్ల, అవనిగడ్డ, రేపల్లె, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా దారి మళ్లిస్తారు. చెన్నై నుంచి వచ్చే వాహనాలను కూడా ఇదే మార్గంలో మళ్లిస్తారు.
* గుంటూరు - విశాఖపట్నం వైపు వెళ్లే వారు బుడంపాడు, కొల్లూరు, తెనాలి, వేమూరు, వెల్లటూరు కూడలి, పెనమూడి వారధి మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లవచ్చు. విశాఖ నుంచి వచ్చే వారు కూడా ఇదే మార్గంలో రావాల్సి ఉంటుంది.
* చెన్నై-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే వాహనాల వారు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. రెండో వైపు నుంచి వచ్చే వాహనాలకు కూడా ఇదే మార్గం వర్తిస్తుంది.
విజయవాడలో సిటీ బస్సుల మార్గాలు
* విజయవాడ సిటీ బస్టాప్ నుంచి విద్యాధరపురం, పాల ప్రాజెక్టు మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను పండిట్ నెహ్రూ బస్టేషన్, పాత పోలీస్ కంట్రోల్‌రూం, గద్ద బొమ్మ కూడలి, కాళేశ్వరరావు మార్కెట్, పంజా సెంటరు, వీజీ చౌక్, చిట్టి నగర్ మీదుగా అనుమతిస్తారు.
బస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులూ మళ్లింపు
* విజయవాడ నుంచి హైదరాబాద్, జగ్గయ్యపేట, తిరువూరు వైపు వెళ్లే బస్సులను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్, స్వాతి జంక్షన్, గొల్లపూడి వై జంక్షన్, ఇబ్రహీంపట్నం నుంచి మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సుల్ని కూడా ఈ మార్గంలోనే మళ్లిస్తారు. అయితే, మూలా నక్షత్రం రోజున (అక్టోబరు 1 రాత్రి నుంచి అక్టోబరు 2 రాత్రి వరకు) కనకదుర్గా పై వంతెన, కాళేశ్వరరావు మార్కెట్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.
మూలా నక్షత్రం రోజున ఇలా (అక్టోబరు 1 రాత్రి నుంచి అక్టోబరు 2 రాత్రి వరకు)
* ఆర్టీసీ, సిటీ బస్సులను కనకదుర్గ ఫ్లైఓవర్, కాళేశ్వరరావు మార్కెట్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు పీఎన్‌బీఎస్, పాత పీసీఆర్, చల్లపల్లి బంగ్లా జంక్షన్, ఏలూరు లాకులు, బుడమేరు బ్రిడ్జి, పైపులరోడ్డు, వైవీ రావు ఎస్టేట్, సీవీఆర్ ఫ్లైఓవర్, సితార, గొల్లపూడి వై జంక్షన్, ఇబ్రహీంపట్నం మీదుగా పంపిస్తారు. మూలా నక్షత్రం రోజున ప్రకాశం బ్యారేజీపై వాహనాలను అస్సలు అనుమతించరు.
* విజయవాడ నగరంలో రాకపోకలు సాగించే వాహనదారులు కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి లేదా చిట్ టినగర్ సొరంగం నుంచి భవానీపురం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్డు, ఘాట్ రోడ్డు నుంచి కుమ్మరిపాలెం వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.
పార్కింగ్ ప్రదేశాలు ఇవీ
* బైక్‌లు, ఇతర టూ వీలర్లను గద్దబొమ్మ పార్కింగ్, లోటస్ అపార్ట్‌మెంట్ పార్కింగ్, పద్మావతి ఘాట్, ఇరిగేషన్ పార్కింగ్ ప్రాంతాల్లో పార్క్ చేసుకోవచ్చు.
* కాళేశ్వరరావు మార్కెట్ సెల్లార్ పార్కింగ్, రాజీవ్ గాంధీ పార్కు పక్క రోడ్డు, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, టీటీడీ పార్కింగ్ కుమ్మరిపాలెం వద్ద కార్లు పార్క్ చేసుకోవచ్చు.
* బస్సులు లేదా ఇతర పెద్ద వాహనాలను పున్నమి ఘాట్, భవానీ ఘాట్, పాత సోమా కంపెనీ స్థలం, సితార కూడలి, సుబ్బారాయుడికి చెందిన ఖాళీస్థలంలో పార్క్ చేసుకోవచ్చు.