Vijayawada News: విజయవాడ వరద ప్రాంత ప్రజలకు మరో హెచ్చరిక- కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం
Andhra Pradesh: విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్నాయి. వందలాదిమంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటిలో రోగులు కనిపిస్తున్నారు.
Vijayawada Floods : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. రోజుల తరబడి మురుగు నీటిలో కాలం వెళ్లదీసిన బాధితులను పలు రకాల వైరస్లు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రతి ఇంటిలోనూ పలువురు వివిధ రకాల వైరస్ లు బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వైద్య శిబిరాలకు వస్తున్న వైరస్ పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాధితులకు అవసరమైన చికిత్స అందిస్తూ మందులు పంపిణీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువ మంది తొలుత జ్వరాల బారిన పడుతున్నారు. ఆ వెంటనే వారికి దగ్గు, జలుబు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. వరద మొదలైన తొలి మూడు, నాలుగు రోజుల్లో సుమారు 1300 మంది జ్వరం బారిన పడితే తరువాత ఈనెల ఆరో తేదీన ఒక్కరోజే 1565 మంది, ఏడో తేదీన 1600 మంది, ఎనిమిదో తేదీన 1730 మంది, తొమ్మిదో తేదీన 1740 మంది జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వరద తగ్గిపోయింది. మురుగునీటి వ్యవస్థ సరిగా లేని కారణంగా దోమలు వేగంగా పెరిగి వైరల్ ఇన్ఫెక్షన్లను మరింత పెంచుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జలుబుతో 10,700 మంది, దగ్గుతో 16 వేల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇబ్బందులకు గురి చేస్తున్న చర్మ సమస్యలు..
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను చర్మ సంబంధిత సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వైద్యుల వద్దకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. పది రోజులపాటు నీటిలోనే జీవనం సాగించడంతో చాలా మంది కాళ్ళ నుంచి పాదాల వరకు చర్మం బాగా మెత్తబడిపోయింది. శరీరంలోని అనేక భాగాల్లో పొక్కులు, దద్దుర్లు, మంట, దురద వంటి సమస్యలు వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమస్యలతో సుమారు ఎనిమిది వేల మంది వైద్య శిబిరాలకు తరలి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదట్లో వరద నీటిలో ఉన్నామని, తరువాత మురుగు నీటిలో తిరిగామని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. పాదాలు మెత్తబడిపోయాయని, చర్మంపై పొక్కులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు నీటిలోనే నడవాల్సిన పరిస్థితి రావడంతో రాళ్లు, గాజు ముక్కలు గుచ్చుకుని 3200 మందికిపైగా గాయపడ్డారు. వీరందరికీ వైద్య శిబిరాల్లో ప్రాథమిక చికిత్స అందించారు. షుగర్, బీపీతో ఇబ్బంది పడుతున్న 14,500 మందికి వైద్య సిబ్బంది మందులు పంపిణీ చేశారు. మొత్తంగా ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో 1.47 లక్షల మంది రోగులు ఇప్పటి వరకు వివిధ రకాల వైద్య సేవలను పొందారు.
అప్రమత్తంగా ఉండడం అవసరం..
వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రానున్న రోజుల్లో మరికొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుల తరబడి వరద నీరు నిల్వ ఉండడంతో వివిధ రకాల వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు రానున్న రోజుల్లో విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దోమల వ్యాప్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజలకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలతోపాటు.. భవిష్యత్తులో ఎదురుకానున్న అనారోగ్య సమస్యల విషయం పట్ల ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా వైద్య శిబిరాలకు వచ్చి చూపించుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read: విజయవాడ వరద బాధితులకు చంద్రబాబు బిగ్ గుడ్‌న్యూస్ - భారీగా ఆర్థిక సాయం ప్రకటన