Vijayawada Crime: బెజవాడలో దారుణం, సిగరెట్ ఇవ్వలేదని పెట్రోల్ పోసి నిప్పంటించాడు !
Crime News : అప్పు నిప్పులాంటిదని పెద్దలు అంటుంటారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే నిత్యం గుర్తొ్స్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుందట. ప్రాణాలు కూడా తీస్తుందట.
Petrol Attack On Grocery Shop Owner: అప్పు నిప్పులాంటిదని పెద్దలు అంటుంటారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే నిత్యం గుర్తొ్స్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుందట. ప్రాణాలు కూడా తీస్తుందట. అలాంటి ఘటన విజయవాడలో జరిగింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అప్పు తీసుకున్న వ్యక్తి కంటే ఇచ్చిన వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడో వ్యక్తి. తీసుకున్న అప్పు చెల్లించమని అడిగినందుకు ఏకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అప్పు తీసుకుని చాలా రోజులైందని, చెల్లించమని అడినందుకు ఏకంగా అతని ప్రాణాలు తీసే పని చేశాడు.
నన్నే అప్పు అడుగుతావా..? అంటూ అప్పు తీసుకున్న వ్యక్తి ఇచ్చిన షాపు యజమానిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. దాడిలో షాపు యజమాని తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనలో పెట్రోల్ పోసిన వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని వద్ద శివ కాసులు అనే వ్యక్తి చాలా సార్లు వస్తువులు అప్పు తీసుకున్నాడు.
అయితే అప్పు చెల్లించడంలో శివకాసులు నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. మంగళవారం సైతం శివకాసులు దుకాణం వద్దకు వచ్చి సిగరెట్ అప్పు అడిగాడు. దుకాణదారుడు స్పందిస్తూ.. ఇప్పటికే అప్పు బాగా పెరిగిపోయిందని చెప్పాడు. అప్పు తీసుకుని చాలా కాలమైందని, వెంటనే చెల్లించాలని కోరాడు. పాత బాకి చెల్లిస్తేనే అప్పిస్తానని తేల్చి చెప్పేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివకాసులుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ దుకాణదారుడితో గొడవకు దిగాడు. దీంతోఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో శివకాసులు తనతో తెచ్చుకున్న పెట్రోల్ వెంకటేశ్వర్లుపై పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో శివకాసులుకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బడ్డీకొట్టు వ్యాపారి వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉంది. శివకాసులకు స్వల్పగాయాలయ్యాయి. వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.