Kolikapudi Srinivas : టీడీపీలో మరోసారి కొలికపూడి కలకలం- ఎంపీ చిన్నిపై సంచలన వ్యాఖ్యలు
Kolikapudi Srinivas : కొలికపూడి శ్రీనివాస్ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్కున్నారు.

Kolikapudi Srinivas : టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి అలజడి రేపారు. తిరువూరులో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మరోవైపు కొలికపూడిపై టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తిరువూరులో కావాలనే కలకలం రేపుతున్నారని మండిపడుతున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పదవులు అమ్ముకుంటూ అవినీతి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో పార్టీ పదవులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో లీడర్లు తిరిగే వాళ్లని ఇప్పుడు ఎంపీ కార్యాలయంలోనే కూర్చొని పదవులు డబ్బులు ఇచ్చే వాళ్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రేషన్ మాఫియా, ఇసుకు మాఫియా నడుపుతూ పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని అన్నారు. ఎంపీ కార్యాలయంలోని మూల్పూరి కిశోర్ చేస్తున్న దందాతో పార్టీ నేతలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న దందాను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు కొలికపూడి. ఈ నెల 24న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తిరువురులో జరుగుతున్న పరిణామాలు వివరిద్దామని కార్యకర్తలకు సూచించారు. అయితే ఎంపీపై కొలికపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో కొలికపూడిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో రాజకీయ అలజడి రేపుతున్నారని ఆగ్రహంతో ఉన్నారు. కొలికపూడి మద్యం దుకాణాల నుంచి నెల నెల వసూళ్లు చేస్తున్నారని, మట్టి మాఫీయను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల కోసం కూడా కొలికపూడి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొలికపూడి ఏదో రకంగా వార్తాల్లో ఉంటూ వస్తున్నారు. పార్టీలో తిరుగుబాటు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇప్పటికే అధిష్ఠానం వద్ద పలుమార్పులు క్లాస్‌లు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మరో కొత్త వివాదంతో మరోసారి సంచలనంగా మారుతున్నారు. పలు మార్లు చంద్రబాబు, ఇతర నేతలు పిలిచి ఆయనకు హితబోధ చేశారు. కానీ ఆయనలో మార్పు కనిపించలేదు.





















