YS Jagan: స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడే గుర్తుకు వస్తుందన్న ఏపీ సీఎం జగన్
Vijayawada Ambedkar Statue: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని, అలాగే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తుకు వస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
Statue of Social Justice : స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా (America)అని, అలాగే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (Statue of Social Justice ) అంటే విజయవాడ (Vijayawada) గుర్తుకు వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( Jaganmohan Reddy ) అన్నారు. మరణం లేని మహానీయుడు విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మన అడుగుల్లో, మన బతుకుల్లో, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాడని అన్నారు.
దేశంలో కుల అహంకారం మీద, పెత్తందారీ వ్యవస్థ మీద, వ్యవస్థల దుర్మార్గలపై పోరాటాలకు అంబేద్కర్ స్ఫూర్తినిస్తూనే ఉంటాడని అన్నారు. ఈ విగ్రహం చూసినపుడల్లా...పేదలు, మహిళల హక్కులు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు సీఎం జగన్. అంబేద్కర్ సమసమాజ భావాలకు నిలువెత్తు రూపమన్నారు. గొంతు వినిపించలేని అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి కారణం అంబేద్కరేనని జగన్ అన్నారు. అణుగారిన వర్గాలకు ఈ విగ్రహం శక్తినిస్తుందని, అండగా నిలుస్తుందన్నారు.
ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాం
8 మందిని రాజ్యసభకు పంపితే అందులో సగం మంది ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారని సీఎం జగన్ తెలిపారు. 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్లలో బలహీన వర్గాలకు చెందిన 9 మందికి పదవులు ఇచ్చామన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం, మన ప్రభుత్వం తప్పా...ఎక్కడైనా చూశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదని, దళితులంటే చంద్రబాబుకు నచ్చరని అన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు.
పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదల సంక్షేమం పట్టదన్నారు. పేదలకు అండగా ఉండాలని...ఈ పెత్తందారి పార్టీలకు ఎందుకు ఆలోచన రాదని ప్రశ్నించారు. దళితులకు చంద్రబాబు నాయుడు సెంటు భూమి ఇవ్వలేదని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్న సీఎం జగన్...పేదలు ఆత్మగౌరవంతో బతకొద్దని పెత్తందారులు కోరుకుంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష అసలే లేదని స్పష్టం చేశారు.
పేదవారు ఇంగ్లీష్ మీడియం చదవొద్దా ?
అంటరానితనం రూపం మార్చుకుందన్న సీఎం జగన్...పేదలను దూరంగా ఉంచడం మాత్రమే అంటరాని తన కాదన్నారు. పేదవారు ఇంగ్లీష్ మీడియం చదవొద్దని కోరుకోవడం కూడా అంటరాని తనమేనన్నారు. పేదలు తెలుగు మీడియంలోనే చదవాలని చెప్పడం వివక్ష కాదా అని జగన్ ప్రశ్నించారు. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలని కోరుకోవడం దుర్మార్గమన్నారు. పథకాల అమలులో కూడా వివక్ష చూపడం అంటరానితనమేనన్న జగన్...అంబేద్కర్ భావజాలం అంటే పెత్తందారులకు నచ్చదన్నారు. సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తుకు వస్తుందని, ఇక నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుందన్నారు.