నందిగామలో రౌండ్ టేబుల్ రాజకీయం- వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య హాట్ డిస్కషన్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌లో నవనందిగామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది.
నవ నందిగామ పేరుతో వైసీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ పై రాజకీయం వేడెక్కింది. నందిగామలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి అందరి మనన్నలు పొందిందని వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఈ సమావేశంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేవలం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసమే నవ నందిగామ అంటూ ఆర్భాటాలు చేస్తున్నారని టీడీపీ, బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చనీయాశంగా మారిన రౌండ్ టేబుల్ మీటింగ్...
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌లో నవనందిగామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. నందిగామ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు పాల్గొని నందిగామ అభివృద్ధిపై వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశం అని శాసనసభ్యుడు మొండితోక జగన్ మోహన్ రావు, శాసనమండలి సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్ ప్రకటించినప్పటికి ఈ వ్యవహరం పై మిగిలిన పార్టిలన్నీ వైసీపిని టార్గెట్ చేశాయి.దీంతో రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయాలకు వేదిక అయ్యింది..
నియోజవర్గంలో అభివృద్ధి నేటికి సాకారం అయ్యింది: ఎమ్మెల్యే
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యుడు మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ...`నందిగామ ప్రజల ఆశీస్సులతో - వారి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, మూడేళ్ల పాలనలో గర్వంగా చెప్పుకోదగ్గ విధంగా పరిపాలన చేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టమైందని తెలిపారు. ఇంటింటికి తాగు నీటి కుళాయి పథకం, కేంద్రీయ విద్యాలయం, రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఓపెన్ జిమ్, రెండు గార్బేజ్ స్టేషన్ల నిర్మాణం, వైఎస్సార్ రైతు బజార్ అండ్ ఫ్రూట్ మార్కెట్, కోవిడ్ హాస్పిటల్ - ఆక్సిజన్ ప్రొడక్షన్ మిషనరీ, రూ.15 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం, శివాలయానికి కోటి రూపాయలు అభివృద్ధి పనులు, పట్టణంలో 9 పాఠశాలల అభివృద్ధి, అనాసాగరంలో వాటర్ పంపింగ్ స్కీం , పాత మునేరు -కొత్త మునేరులో కొత్త మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు, సీఎం రోడ్డు విస్తరణ, గాంధీ జంక్షన్ అభివృద్ధి లాంటి ఎన్నో పనులు చేపట్టామన్నారు. నందిగామను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధి పనులకు అడ్డుపడటం మంచి పద్ధతి కాదన్నారు.
మండిపడ్డ టీడీపీ,బీజేపి
నవ నందిగామ పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ వెనుక ఎమ్మెల్యేతో పాటుగా ఆయన కుమారుడు ఎమ్మెల్సీ ఉన్నారని, అభివృద్ధి అనే పేరు చెప్పి విగ్రహాల మాటున రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దోపిడికి పాల్పడేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించారని టీడీపీ కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణలత ఆరోపించారు. నందిగామ గాంధీ సెంటర్లో విగ్రహాల ఏర్పాటుకు మరోసారి రౌండ్ టేబుల్ సమావేశం అంటూ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రౌండ్ టేబుల్ పేరు చెప్పి, అందరినీ అక్రమాలలో భాగస్వాములు చేయడాని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైలాన్, ఏర్పాట్లు చేయడానికి నందిగామ నగర పంచాయతీ డబ్బు 20 లక్షలు ఏకపక్షంగా ఖర్చు పెట్టినప్పుడు అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.