Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ మరో 20 ఏళ్లే పని చేస్తుంది- ఏబీపీ దేశంతో కన్నయ్య సంచలన కామెంట్స్
Vijayawada: ప్రకాశం బ్యారేజ్ మరో ఇరవై ఏళ్లు మాత్రమే పని చేస్తుందని బాంబు పేల్చారు రిటైర్డు ఇంజనీరు కన్నయ్య నాయుడు. దీంతో త్వరలోనే మరో కొత్త బ్యారేజ్ నిర్మాణం తప్పదా అనే చర్చ మొదలైంది.
Prakasam Barrage: దాదాపు పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరకు వచ్చిన వరద ఉద్ధృతిని తట్టుకున్న ప్రకాశం బ్యారేజ్ ఉండేది మరో 20 సంవత్సరాలేనా? త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేయక తప్పదా అంటే అవుననే అంటున్నారు రిటైర్డు ఇంజనీర్ ప్రముఖ జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్య నాయుడు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వాటి పనితీరుకు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్‌లో దేశవ్యాప్తంగా పేరుపొందారు ఇంజనీర్ కన్నయ్య నాయుడు. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిన సమయంలో దానికి స్టాప్ లాగ్ ఏర్పాటు చేసి ప్రాజెక్టు కాపాడిన ఘనుడాయన. దానితో ఆయన్ను ఏపీ జలవనరుల శాఖ మెకానిక్ విభాగ సలహాదారు గా ఏపీ ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం వదరలకు కృష్ణా నదిలో కొట్టుకు వచ్చిన బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌లోని 67, 69, 70 గేట్లపైన ఉన్న కౌంటర్ వెయిట్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వాటిని మార్చే పనిలో అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు కన్నయ్య నాయుడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకట్రెండు రోజుల్లో పాత కాంక్రీట్ కౌంటర్ వెయిట్ నిర్మాణాల ప్లేస్‌లో కొత్త మెటల్ కౌంటర్ వెయిట్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బోట్లు ఢీ కొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజ్ దెబ్బ తినలేదని చెబుతూనే దాని లైఫ్ టైం మాత్రం మరో 20 ఏళ్లు అని ABP దేశం తో ఎక్స్ క్లూజీవ్ గా తెలిపారు. అదే నిజమైతే త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టాల్సిందే అన్న చర్చ మొదలైం.
జల ప్రళయం నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ప్రకాశం బ్యారేజ్
భీకర వరదలను తట్టుకుని విజయవాడ సహా మొత్తం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలను కాపాడింది ప్రకాశం బ్యారేజ్. ఇటీవల చరిత్రలో ఎన్నడూ లేనంత వర్షాన్ని చూసింది విజయవాడ. దానితోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కూడా కృష్ణలో చేరడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వందేళ్ల తర్వాత పదకొండున్నర లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. దానితో ఏక్షణం ఏం జరుగుతుందో అన్న భయం అందరిలో నెలకొంది. కానీ అంతటి ప్రవాహాన్ని సైతం తట్టుకుని నిలబడింది ప్రకాశం బ్యారేజ్. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగుంటే కేవలం బుడమేరు అనే పెద్ద వాగు పొంగినందుకే సగం మునిగిపోయిన బెజవాడ... కృష్ణ కూడా అదుపు తప్పితే తట్టుకునే స్థితిలో లేకపోయేది. అయితే ఈ చిన్న బ్యారేజ్ అంత పెద్ద వరదనూ సమర్థవంతంగా తట్టుకుని పెద్ద విలయాన్ని తప్పించింది. కానీ ఈ టైంలో దాని జీవితకాలం మరో దాదాపు ఇరవై ఏళ్ళు మాత్రమే అని తేలింది.
ప్రకాశం బ్యారేజ్ చరిత్ర ఇదే
1832 ప్రాంతాల్లో డొక్కల కరవు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్ని పీడించింది. పంటలకు నీరు లేక జనం అల్లాడి పోయారు. తిండి లేక చనిపోయిన వారి సంఖ్య లక్షల్లోనే. దానితో కృష్ణలో నీటిని నిలువ చేసుకునేలా ఒక బ్యారేజ్‌ను విజయవాడ వద్ద నిర్మించాలని బ్రిటీష్ ప్రభుత్వం భావించింది. ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ దొర కూడా ఇదే సూచించారు. ఈ ప్రాజెక్ట్ 1853లో ప్రారంభమై 1854లో పూర్తైంది. కాటన్ శిష్యుడు మేజర్ చార్లెస్ ఓర్ ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. దాని పొడవు 1132 మీటర్లు. దానికి పెట్టిన ఖర్చు 1.49 కోట్ల రూపాయలు. వందేళ్ళపాటు సేవలందించిన ఈ బ్యారేజ్ 1952లో వరదలకు కొట్టుకుపోయింది
కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త బ్యారేజ్
బ్రిటీష్ వాళ్ళు కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోవడంతో ఆ ప్లేస్‌కు కొంత ఎగువన కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 1954లో ఫిబ్రవరి 13న పనులు ప్రారంభించింది. ఈ నిర్మాణం నాలుగేళ్ల పాటు సాగి 1957 డిసెంబర్ 24 న ప్రాజెక్ట్ రెడీ అయ్యింది. దీని నిర్మాణానికి 2.78 కోట్లు ఖర్చయిందని రికార్డ్స్ చెబుతున్నాయి. దీని పొడవు 1223 మీటర్లు. కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ నీరు అందిస్తుంది. అప్పటి నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఎన్నో వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ప్రకాశం బ్యారేజ్ మరో 20ఏళ్ల పాటు ఉపయోగపడుతుంది అని కన్నయ్య నాయుడు తెలిపారు.
Also Read: ఉత్తరాంధ్రను భయపెడుతున్న వాయు"గండం"- మరో రెండు రోజులు పొంచి ఉన్న ప్రమాదం