Pithapuram Crime News: పిఠాపురం పోలీసులకు చిక్కిన ఉద్యోగాల పేరుతో మోసం చేసే గ్యాంగ్-8 మంది అరెస్ట్ ; బంగారం, నగదు సీజ్
Pithapuram Crime News: ఉద్యోగాలున్నాయంటూ పోస్టర్లు వేసి మరీ నిరుద్యోగుల వద్ద నుంచి ప్రోసెసింగ్ ఫీజుల రూపంలో అందినకాడికి నొక్కేసే ముఠాను పిఠాపురం పోలీసులు పట్టుకున్నారు.

Pithapuram Crime News: ఎక్కడైనా ఉద్యోగ ప్రకటన కనిపిస్తే చాలు వెంటనే ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకునే నిరుద్యోగులున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్నే అవకాశంగా తీసుకుని ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూళ్లు చేస్తున్న ముఠాలు ఇటీవల కాలంలో ఎక్కవై పోయాయి. సరిగ్గా ఇలాగే ఉద్యోగాలున్నాయంటూ పోస్టర్లు వేసి మరీ నిరుద్యోగుల వద్ద నుంచి ప్రోసెసింగ్ ఫీజుల రూపంలో అందినకాడికి నొక్కేసి మోసం చేస్తున్న ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు ఆటకట్టించారు. పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా ట్రాన్జ్ ఇండియా కార్పోరేట్ నెట్‌వర్క్ పేరుతో నిరుద్యోగ యువతకు గాలం వేసి మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వీరి వలకు చిక్కి దఫదఫాలుగా డబ్బులు పోగొట్టుకున్న కొంద మంది నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు దృష్టిసారించిన జిల్లా ఎస్పీ బిందుమాధవ్
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 8 మంది ముఠా సభ్యులను అరెస్ చేశారు. వీరి నెట్ వర్క్ కేవలం పిఠాపురం వరకే కాదని రాష్ట్రస్థాయి ముఠాగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు..
ట్రాన్జ్ ఇండియా కార్పోరేట్ నెట్‌వర్క్ పేరుతో మోసం..
నిరుద్యోగులే టార్గెట్‌గా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతోన్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కాకినాడ ఎస్ డి పివో పాటిల్ దేవరాజ్ మనీష్, పిఠాపురం సిఐ శ్రీనివాస్, ఎస్సైలు మణికుమార్, వెంకటేష్ నాయుడు, క్రైమ్ బృందం తో కలిసి నిరుద్యోగులకు టోకరా వేసిన ముఠాను మీడియా ముందుంచారు. ఎస్‌డిపీవో పాటిల్ దేవరాజ్ మనీష్ మాట్లాడుతూ పిఠాపురంలో కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ట్రాన్జ్ ఇండియా కార్పోరేట్ నెట్‌వర్క్ పేరుతో ఓ పోస్టర్‌ను చూసిన నాళం గంగాభవానీ, కోటిపల్లి సాయి అనే ఇద్దరు మోసపోయి వారిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉద్యోగం కోసం పోస్టర్‌పై ఉన్న నెంబర్లకు ఫోన్ చేస్తే పలు దఫాలుగా వారి వద్ద నుంచి వేలాది రూపాయలను ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నారని వెల్లడించారు. రోజులు గడుస్తున్నా ఎటువంటి ఉద్యోగం రాకపోగా, మోసపోయినట్లు వారు నిర్థారించుకుని పోలీసులను ఆశ్రయించారన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్ వర్క్ అని తేలిందన్నారు. ఇలా నిరుద్యోగులను ఎరవేసి రూ.75 లక్షల వరకూ ఇప్పటి వరకూ ఆ ముఠా సేకరించినట్లు గుర్తించామన్నారు.
డేటా ఎంట్రీ, టెలికాలింగ్ ఉద్యోగాల పేరుతో మోసం..
ఇటీవల కాలంలో వర్క్‌ఫ్రమ్ హోం పేరుతో జరుగుతోన్న మోసాల తరహాలోనే ఈ కేటుగాళ్లు కూడా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరు వేయించిన పోస్టర్లపై రాజమండ్రిలో కార్యాలయం చూపించి, నిరుద్యోగులకు డేటా ఎంట్రీ, టెలికాలింగ్ ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల నుంచి జాబ్ ప్రొసెసింగ్ ఫీజు పేరుతో లక్షల రూపాయాలు ఈ ముఠా సేకరించినట్లు గుర్తించారు పోలీసులు. ముఠా అకౌంట్లను సీజ్ చేశామని, వారి వద్ద నుంచి 20 గ్రాముల బంగారం, ఏటీఎమ్ కార్డులు, రూ.53 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సంస్థలో పనిచేస్తున్న 8 మందిని అరెస్ చేసి కోర్టుకు హాజరుపరిచారు.
నిందితులంతా కర్ణాటక, అనంతపురం, నంధ్యాల, తుముకూరు, ఉప్పలగుప్తం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. నిరుద్యోగులు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ డిపివో పాటిల్ దేవరాజ్ మనీష్ సూచించారు. ముఠాను ఛేదించిన పిఠాపురం క్రైమ్ బృందాన్ని ఆయన అభినందించారు. నిరుద్యోగులు ఇలా ఉద్యోగాల ఎరచూపి డబ్బులు వసూళ్లకు పాల్పడుతుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.





















