Duvvuri Krishna: అప్పులపై తప్పుడు ప్రచారం- ప్రతిపక్షాలపై సీఎం ప్రత్యేక కార్యదర్శి
Duvvuri Krishna: ఏపీ ఆర్థిక పరిస్థితులపై ప్రతిపక్షాలు తప్పుడు విశ్లేషణలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తెలిపారు. కావాలనే ఇలా చేస్తున్నారన్నారు.
Duvvuri Krishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం, కొందరు విశ్లేషకులు తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి(ఫైనాన్స్) దువ్వూరి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీఏఐ నుంచి జీవీ రావును తొలగించిన విషయాన్ని దువ్వూరి కృష్ణ గుర్తు చేశారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి ప్రభుత్వ రంగ సంస్థలకు పూచీకత్తు ఇవ్వొచ్చని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అప్పులపై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బాధ్యాతారాహితంగా ప్రవర్తించడం సరికాదు..!
"ఆయన బాధ్యతారహితంగా ప్రవర్తించడం అనేది కరెక్టు కాదు. జీవీ రావు అనే వ్యక్తి ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. గంటా వెంకటేశ్వర రావు- జీవీ రావు అనే వ్యక్తి గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తుంటే.. సీఏ ఇన్‌స్టిట్యూట్ వారు జీవీ రావును రెండు సంవత్సరాలు సస్పెండ్ చేసిన వార్త తప్పించి పెద్దగా ఏ సమాచారమూ దొరకలేదు. ఇలాంటి వార్తలు తప్పా.. జీవీ రావు అనే వ్యక్తి బడ్జెట్ తయారీలో కీలకంగా వ్యవహరించారని, బడ్జెట్ కోసం పని చేశారు, గవర్నమెంట్‌తో కలిసి పని చేశారు, లేదంటే పబ్లిక్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ తో కలిపి పని చేశారు లాంటి ఏరకమైన న్యూస్ కూడా మాకు దొరకలేదు. ఎవరికీ పరిచయం లేని వ్యక్తి జీవీ రావు. ఆయన కూడా ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి చెబుతూ ఎలాంటి విశ్లేషణ చూపించలేదు. ఎలాంటి విశ్లేషణ చెప్పకుండా, దేని గురించి ప్రస్తావించకుండా.. ఊరికే వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం, రాష్ట్ర సర్వనాశనం అయిపోతుందని చెప్పడం అలాంటా వారి వ్యాఖ్యలను ప్రముఖ తెలుగు వార్తా పత్రిక ప్రచురించడం తీవ్ర అభ్యంతరకరం". - సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ
"ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి నిపుణులు అనే పేరు పెట్టేసి వారు చెప్పేది పత్రికల్లో ప్రచురించడం సరైన పద్ధతి కాదు. మనం ఏపీ రాష్ట్రం గురించి, ఏపీ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 21.87 శాతం CAGR చొప్పున పెరిగిన అప్పులు, ఇప్పుడు 12.69 శాతం CAGR చొప్పున మాత్రమే పెరిగాయి. దీనిని అప్పుల ఊబిలో కూరుకుపోవడం అంటారా? ఇందులో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. స్టేట్ డెట్, గ్యారెంటీడ్ డెట్, నాన్ గ్యారెంటీడ్ డెట్, లయబిలిటీస్ కూడా ఉన్నాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోయింది. ప్రజల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖర్చులు పెరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ.. గత ప్రభుత్వ హయాంలో పెరిగినట్లు, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు పెరగలేదు. అసలు అప్పు కూడా టీడీపీ హయాంలో 2.60 లక్షల కోట్ల అప్పు పెరిగితే, ఇప్పుడు మాత్రం రూ.2.35 లక్షల కోట్లే పెరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని ఎలా చెబుతారు" అని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తెలిపారు.