Budameru Floods: బుడమేరు వరద బీభత్సానికి ఏడాది.. ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ఇవే
Vijayawada Floods | 2024లో బుడమేరు వరద బీభత్సానికి ఏడాది పూర్తయింది. కానీ ఇప్పటికీ పరిష్కారం కాని ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 ఆగస్టు 31,సెప్టెంబర్ 1 వ తేదీల్లో బుడమేరు వరద బీభత్సాన్ని సృష్టించింది. విజయవాడ నగరం, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలు జల ప్రళయానికి గురయ్యాయి.అధికార సమాచారం ప్రకారం విజయవాడలో 63,174 ఇళ్లు, అదనంగాపై అంతస్తులోని 25,486 కుటుంబాలు నీట మునిగాయని లెక్కలు చెబుతున్నాయి.179 సచివాలయాల పరిధిలో నగరములోని 32 డివిజన్లు వరద ముంపుకు గురయ్యాయి.
జిల్లాలో 19మండలాల్లో 109 గ్రామాలపై వరద ప్రభావం పడింది. మొత్తం 6,54,473 మంది వరద ముంపుకి గురయ్యారు. 4,581ఆటోలు, 44,285 మోటార్ సైకిళ్లు మునిగిపోయాయి, . దాదాపు ఏడు రోజుల నుండి పది రోజులు వరకు ఇళ్ల నుండి నీరు పోలేదు. అధికార లెక్కలకు మించి రెట్టింపు నష్టం జరిగింది. సంవత్సరం గడిచింది. శాశ్వత చర్యలు లేవు. వరద సహాయము అందరికీ అందలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో లో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి బుడమేరు వరద బాధితులు తరఫున సిపిఎం పార్టీ కొన్ని ప్రశ్నలు వేసింది.
వరద ముంపు నివారించడానికి శాశ్వత చర్యలు ఏమి తీసుకున్నారు?
బడ్జెట్ లో నిధులు ఎంత కేటాయించారు? ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టారు?
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన 6880 కోట్ల రూ.లలో ఎంత మేర నిధులు వచ్చాయి?
2025 మార్చి 18న శాసనసభలో మంత్రి ప్రకటించిన విధంగా ముంపు నివారణకు నిర్దేశించిన ప్రణాళిక ఎంతవరకు అమలు జరిగింది?
25 కిలోమీటర్ల పొడవున సమాంతరంగా మరొక కాలువ నిర్మించాలనే ప్రతిపాదనకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారా? టెండర్లు పిలిచారా? నిధులు కేటాయించారా?
కృష్ణానది తరహాలోనే బుడమేరుకు రక్షణ గోడలు (రిటైనింగ్ వాల్) నిర్మాణానికి అనుమతులు ఇచ్చారా? టెండర్లు పిలిచారా?
వెలగలేరు రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయి?
కృష్ణానదిలో కలిసే బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం 15వేల క్యూసెక్కుల నుండి 37,500 క్యూసెక్కులకు పెంపుకు ఏమి చర్యలు తీసుకున్నారు? నిధులు ఎంత కేటాయించారు?
వెలగలేరు రెగ్యులేటర్ కు ఎగువున అదనంగా నాలుగు రిజర్వాయర్లు నిర్మించాలని నిపుణుల కమిటీలు ఇచ్చిన సిఫారసులను ప్రభుత్వం పరిశీలించిందా? చర్యలు తీసుకున్నదా?
ఎనికేపాడు అండర్ టన్నెల్ వద్ద సామర్థ్యం పదివేల క్యూసెక్కుల నుండి నుండి అదనంగా పెంచడానికి ఏమి చర్యలు చేపట్టారు?
కొల్లేరు వరకు బుడమేరును సామర్థ్యం, లోతు పెంచటానికి తీసుకున్న చర్యలు ఏమిటి?
ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలవడానికి, సామర్థ్యం పెంచడానికి ఏ చర్యలు తీసుకున్నారు?
ఆకివీడు రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న అడ్డంకుల తొలగింపుకు రైల్వే శాఖతో చర్చలు జరిపి చర్యలు తీసుకున్నారా ?
వివిధ ప్రాంతాలలో 16 చోట్ల గండ్లు పడితే ఎన్ని చోట్ల పూడ్చారు?
కొండపల్లి శాంతినగర్ వద్ద గండి పూడ్చడం తప్ప 64 కిలోమీటర్ల పొడవున ఉన్న ఛానల్ కు రక్షణ గోడల నిర్మాణం ఎక్కడ అయినా జరిగిందా?
340 మీటర్లు (0.34 కి.మీ.) తప్ప అదనంగా ఎక్కడైనా గోడలు కట్టారా?
వరద బాధితులు ఆదుకోవటానికి దాతలు ఇచ్చిన విరాళాలు మొత్తం ఎంత? వాటిని ఎలా వినియోగించారు? దేనికి ఖర్చు పెట్టారు?
వరదల సందర్భంలో ఆహార ప్యాకెట్లకు 368 కోట్ల రూ. మంచినీటికి 26 కోట్ల రూ. మొత్తం కలిపి 600 కోట్లు పైన ఖర్చు చేసినట్లు 18.9.2024 రెవెన్యూ శాఖ అధికారికంగా నివేదిక విడుదల చేసిన విషయం వాస్తవమేనా?
ఈ ఖర్చులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపారా? లోపాలు జరిగితే ఎవరిపైన అయినా చర్యలు తీసుకున్నారా?
వరద ముంపు ముందస్తు హెచ్చరికలు చేయటంలో వైఫల్యం ఎవరిది ? విచారించారా? బాధ్యులు ఎవరు?
వరద సహాయం అందలేదని నివాసగృహాలు, వ్యాపారులు, ఆటో ఇతర బాధితులు ప్రభుత్వ కార్యాలయాలలో ఎంతమంది దరఖాస్తులు పెట్టారు? ఆన్లైన్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? విచారించి ఎంతమందికి సహాయం అందించారు?
వరదల సందర్భంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లు, భవనాలు ఇతర నిర్మాణాలకు, మౌలిక సదుపాయాలకు పునర్నిర్మాణానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఎన్ని పనులు పూర్తయ్యాయి?
దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణానికి ఇంటికి 2 లక్షల 50 వేల రూ. ఎంతమందికి కేటాయించారు?
ఎంతమంది వ్యాపారులు దెబ్బతిన్నారు. ఎంతమందికి సహాయం అందించారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనీ, ఇప్పటికైనా శాశ్వత చర్యలు చేపట్టాలి, సహాయం అందని బాధితులకు అందించాలనీ సిపిఎం నేత సిహెచ్.బాబురావు ఒక లేఖ రాసారు.
డైవర్షన్ కెనాల్ రక్షణ గోడ పనులు జరుగుతున్నాయి : ప్రభుత్వం

అయితే ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం మేరకు విజయవాడ పరిధిలోని శాంతి నగర్ సమీపంలో లో గత ఏడాది గండి పడిన ప్రాంతం లోనే బుడమేరు డైవర్షన్ కెనాల్ ఫై రక్షణ గోడ నిర్మిస్తున్నారు. మొత్తం 500 మీ నిర్మించాల్సి ఉండగా 365 మీటర్లు పూర్తి చేసారు. 15 వేల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి 23 కోట్లు కేటాయించారు. అయితే బుడమేరు పరిధి లో 380 ఎకరాల పరిధి లో ఆక్రమణలు ఉన్నాయి. వాటిని తొలగించకపోతే మాత్రం ఎప్పటికైనా బుడమేరు తో విజయవాడ కు ప్రమాదమే అంటున్నారు నిపుణులు. మరి ప్రభుత్వం దానిపై దృష్టి పెడుతుందో లేదో చూడాలి.





















