Kodali Nani: యార్లగడ్డ వెంకట్రావుపై కొడాలి నాని సెటైర్లు, నారా లోకేశ్ యాత్రపై కూడా
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గురించి స్పందిస్తూ.. లోకేశ్‌కి టీడీపీలో ఏం పదవి ఉందని కొడాలి నాని ప్రశ్నించారు.
గుడివాడలో పోటీ చేయడానికి టీడీపీ తరపున ఎవరు వచ్చినా ఇబ్బందేమీ లేదని కొడాలి నాని కొట్టిపారేశారు. వైఎస్ఆర్ సీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు నిన్న టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తాను గుడివాడ నుంచి పోటీ చేసేందుకు కూడా రెడీ అని చెప్పడంతో దానిపై స్పందించాలని నేడు (ఆగస్టు 22) విలేకరులు కొడాలి నానిని అడిగారు. దాంతో కొడాలి నాని సెటైర్లు వేశారు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం కొడాలి నాని విలేకరులతో మాట్లాడారు.
గుడివాడ ఎళ్లాను.. అనే పాటను కొడాలి నాని ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితిపై ఎన్టీ రామారావు 40 ఏళ్ల క్రితమే చెప్పారని అన్నారు. ఓ వెంకట్రావు.. ఓ సుబ్బారావు.. ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా అని ఆ పాటలో ఉంటుందని, ఆ ప్రకారం ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వస్తే రావచ్చని అన్నారు. ఏ వెంకట్రావు వచ్చినా, సుబ్బారావు వచ్చినా ఏమీ పీకలేరని అన్నారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గురించి స్పందిస్తూ.. లోకేశ్‌కి టీడీపీలో ఏం పదవి ఉందని ప్రశ్నించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనేది ఒక పదవా? అని ఎద్దేవా చేశారు. అసలు టీడీపీ పక్కన తెలంగాణలో పోటీ చేసి గెలవగలదా అని అన్నారు. అసలు ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేని పార్టీ టీడీపీ అని కొట్టిపారేశారు. మంగళగిరిలో వైసీపీ నేత మీద ఓడిపోయిన వ్యక్తి లోకేశ్ అని మాట్లాడారు. అలాంటి లోకేశ్ తమ గురించి మాట్లాడడం.. మళ్లీ తాము దాని గురించి స్పందించడం వేస్ట్ అని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఈసీ ఆఫీసుకు ధర్నాకు వెళ్లారని కొడాలి నాని గుర్తు చేశారు. ఓట్లను తొలగించారని చంద్రబాబు నిరసన తెలిపారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఓట్లు తీసివేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఓట్లు తీసేశారని అంటున్నారని నాని అన్నారు. సీఎం జగన్ ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకొని అధికారంలోకి వచ్చారని, పవన్ కల్యాణ్ నో, మోదీనో ఇంకొకర్నో నమ్ముకోలేదని అన్నారు.
చిరంజీవి వేడుకల్లో కొడాలి నాని
గుడివాడలో చిరంజీవి యువత ఆధ్వర్యాన చిరు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని ముఖ్య అతిధిగా పాల్గొని చిరంజీవి పేరు మీద జన్మదిన కేక్ ను కట్ చేశారు. అభిమానులకు మిఠాయిలు పంపిణి చేశారు. ప్రతి ఏటా తాను చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహిస్తానని కూడ కొడాలి నాని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని చిరంజీవి అభిమానులు నిత్యం తన వెంట ఉంటారని అన్నారు.
మెగా స్టార్ చిరంజీవిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు వక్రీకరించారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తాను మోగా స్టార్ చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ విసిరారు. తాను శ్రీరామ అన్నా తెలుగు దేశం, జనసేన నాయకులకు బూతు మాటలుగా వినపడతాయన్నారు. తాను మాట్లాడిన మాటలు అన్నీ చిరంజీవికి, ఆయన అభిమానులకు కూడా తెలుసని చెప్పుకొచ్చారు. తామంతా క్లారిటీ గానే ఉన్నామని అన్నారు.