Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Andhra Pradesh: ఢిల్లీ ధర్నా తర్వాత ఇండియా కూటమిలో చేరే విషయంపై జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ నిర్ణయాలను బట్టి తన తదుపరి చర్యలు ఉండబోతున్నటు తెలుస్తోంది.
YSRCP Vs Congress: వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులు చేసి బహిరంగంగా, పోలీసులు సమక్షంలోనే అతి క్రూరంగా చంపుతున్నారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా నిర్వహించారు. టీడీపీ అరాచకాలను అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన జగన్‌కు వారి అపాయింట్ మెంట్ మాత్రం దొరకలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఇండీకూటమి నాయకుల సంఘీభావం
జగన్ నిర్వహించిన నిరసన దీక్షకు ఇండీకూటమి నాయకుల నుంచి సంఘీభావం లభించింది. ఇండీకూటమిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల నాయకులతోపాటు తటస్థ పార్టీల నాయకులు సైతం దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. జగన్ దీక్షకు తమ మద్దతు ప్రకటించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీలో జరుగుతున్న దాడులకు సంబంధించి దీక్షా శిబిరంలో ప్రదర్శించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వీడియో క్లిప్పింగులు చూసి వాటిపై ఆరా తీశారు.
అండగా ఉంటామని భరోసా
ఇండీకూటమిలోని ప్రముఖ నాయకులు హాజరవడంతో సరికొత్త రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది. సమాజ్ వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు ఎంపీలు రాంగోపాల్ యాదవ్, ప్రియాంక చతుర్వేది, మహారాష్ట్రకు చెందిన శివసేన ( ఉద్ధవ్ వర్గం) లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ శేవాలే, రాజ్య సభ సభ్యులు సంజయ్ రౌత్, అలాగే, తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ తంబి దురై వెళ్లి మద్దతు ప్రకటించారు. దాడులను ఎదిరించి ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడాలని సూచించారు. మీకు మా మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగినా ఇవ్వలేదు
2019లో ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలిచిన నాటి నుంచి రాజ్యసభలో బీజేపీకి జగన్ మద్దతు ఇస్తూ వచ్చారు. జగన్ కోరినప్పుడల్లా ఆయనకు ప్రధాని, హోంమంత్రి, ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్లు దొరికేవి. సంక్షేమ కార్యక్రమాలకు నిధుల విషయంలోనూ కేంద్రం నుంచి గట్టిగానే సపోర్టు లభించింది. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఏపీలో ఎన్‌డీఏ అధికారంలోకి రావడమే కాకుండా టీడీపీ సపోర్టుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో జగన్‌కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్నటి ధర్నాకు అపాయింట్ దొరకలేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఇవ్వడం లేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
Also Read: జగన్ కాంగ్రెస్‌కు దగ్గరైతే షర్మిల దారెటు ? అన్నతో రాజీపడతారా ?
11 మంది రాజ్యసభ సభ్యులే దిక్కు
టీడీపీ సపోర్టుతో కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న నేపథ్యంలో చంద్రబాబును కాదని జగన్ కోసం మోడీ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. టీడీపీకి 16 మంది ఎంపీలుంటే తన వద్ద 11 మంది రాజ్యసబ సభ్యులతో కలిపి తనకు 15 మంది ఎంపీలున్నారని జగన్ పలుమార్లు హెచ్చరించే ప్రయత్నం చేసినా మోడీ మనసు కరగలేదని అంటున్నారు. దీంతో పనవదని తెలసిన జగన్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించినట్టు ఢిల్లీలో నిర్వహించిన ధర్నాను బట్టి అంచనా వేయొచ్చు. గతంలో ఇండీకూటమిలో చేరమని కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలకు వర్తమానాలు అందినా వైసీపీని మాత్రం సంప్రదించలేదు. కానీ మొన్నటి ధర్నాకు మాత్రం కాంగ్రెస్ నాయకులు తప్ప అన్ని పార్టీలు వచ్చి మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగించే అంశమే.
చంద్రబాబుకు కాంగ్రెస్ మద్దతు: జగన్
ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు అన్ని పక్షాల నేతలను ఆహ్వానించామన్నారు జగన్. కాంగ్రెస్‌ను కూడా పిలిచామన్నారు. కానీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న రాహుల్ గాంధీ మాత్రం రాలేదన్నారు. తనకు అనుకూల పార్టీ అధికారంలో ఉందని ఏపీ ఘటనలపై స్పందించడం లేదన్నారు. మణిపూర్‌లో వ్యతిరేక పార్టీ ఉండటంతో స్పందిస్తున్నారని మండిపడ్డారు.
జగన్ తక్షణ కర్తవ్యం ఏంటి..?
11 మంది రాజ్యసభ ఎంపీల ఆశ చూపించినా బీజేపీ తనను ఆదరించే స్థితిలో లేదని జగన్ కు అర్థమైంది. చంద్రబాబును కాదని ముందుకెళ్లే ఆలోచన మోడీకి ఉన్నట్టు లేదు. ఇదే విషయం ఢిల్లీ ధర్నాతో జగన్‌కు కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది. సొంతంగా పోరాడి కార్యకర్తలను కాపాడుకోవడం అనేది అసంభవం అనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు జగన్. రాజ్యసభలో ఎన్‌డీఏ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. బిల్లులు పాస్ కావాలంటే ఏ కూటమికైనా జగన్ అవసరం తప్పనిసరి. దీంతో ఇండీకూటమి సభ్యులు సైతం ఆయన్ను ఆదరించారు. సొంతంగా పోరాడి గెలిచిన నాయకుడు కావడం, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా 40 శాతం ఓటు బ్యాంకు సాధించడంతో ఆయన ఛరిస్మా కూటమికి కూడా ఉపయోగపడుతుందని వారి ఆలోచన. జగన్ ను ఇండీకూటమిలో శాశ్వతంగా చేర్చుకుంటే భవిష్యత్తులోనూ తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూటమికి తిరుగుడందని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
కాంగ్రెస్ దూరంగా ఎందుకున్నట్టు..?
జగన్ ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు ఇండీకూటమిలోని అన్ని పార్టీల నాయకులు హాజరైనా కాంగ్రెస్ సభ్యులు మాత్రం దూరంగా ఉన్నారు. అయితే వారంతా కూటమిలో అంతర్గతంగా సంప్రదించుకోకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఉంటారని అనుకోలేం. కానీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం వెనుక పెద్ద వ్యూహమే అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ పరోక్షంగా తమ మద్దతు జగన్‌కే ఉంటుందని మొన్న అఖిలపక్ష సమావేశం తర్వాత జైరాం రమేశ్ టీడీపీని కార్నర్ చేసి ట్వీట్ చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సోదరి షర్మిలతో జగన్ కు కొన్ని ఇబ్బందులున్నాయి. వాటిని పరిష్కరించుకున్నాక కూటమిలో చేరడమో లేదా ఏదైనా మంచి సందర్భం కోసం వేచిచూస్తున్నారా అనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాను కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే జగన్‌ను ఎప్పుడెప్పుడు జైలుకు పంపాలా అని వేచిచూస్తున్న టీడీపీ దానిని అవకాశంగా మలుచుకోవచ్చు. బీజేపీపై కూడా తన వ్యతిరేకులపై ఈడీ, సీబీఐ కేసులు ప్రయోగించి వేధిస్తుందనే అపవాదు లేకపోలేదు. సో.. ఈ వ్యవహరాలన్నింటినీ ఆలోచించి ముందుకెళ్లాలని అనుకొని ఉండవచ్చు. ఒకవేళ పాత కేసులు తిరగతోడి జగన్‌ను జైలుకు పంపితే గనుక ఇండీకూటమి సపోర్టు జగన్‌కు కచ్చితంగా ఉంటుందనేది పరిశీలకుల అంచనా.. ఎందుకంటే ధర్నా అనంతరం ఇండీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎక్స్‌లో జగన్ ధర్నాకు అనుకూలంగా పోస్ట్ చేయడాన్ని తీసిపారేయలేం. ఇదంతా వ్యూహాత్మకంగా బీజేపీని ఇరుకున పెట్టడానికి జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు.
Honorable National President Shri Akhilesh Yadav ji joined the protest being organized by YSR Party at Jantar Mantar, Delhi against the anarchy happening in Andhra Pradesh and former Chief Minister Shri Jagan Mohan Reddy@yadavakhilesh @ysjagan pic.twitter.com/Qf4h5QeMfW
— I-N-D-I-A (@_INDIAAlliance) July 24, 2024
ఈ ట్వీట్ చేయడానికి కొద్ది నిమిషాల ముందు Game Is On అంటూ మరో సందేశం పోస్ట్ చేశారు. ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతుందనే చెప్పడానికి ఇవన్నీ బలాన్నిస్తున్నాయి. ఎప్పుడూ కాంగ్రెస్‌ను విమర్శించడానికి ముందుండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దాడులపై బీజేపీ ప్రేక్షకపాత్ర పోషిస్తోందని బీజేపీపై విరుచుకుపడిపోయాడు.
Also Read: "సీఎంగా జగన్ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత