వివేక హత్య కేసు దర్యాప్తుపై టీడీపీ స్లీపర్ సెల్స్ ప్రభావం- సజ్జల సంచలన కామెంట్స్
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సీరియస్ కామెంట్స్ చేశారు. బీజేపీలో ఉన్న టీడీపీ స్లీపర్ సెల్స్ ప్రభావంతో జరుగుతోందన్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు సక్రమంగా జరగలేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీలోని ఓ వర్గం ఒత్తిడితోనే కేసులు నడుస్తున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే అవినాష్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారని కామెంట్ చేశారు. ఎప్పుడైనా సీబీఐ పిలిస్తే వెళ్లడానికి అవినాష్ రెడ్డి ఫ్యామిలీ సిద్ధంగా ఉందన్నారు. తమకు తెలిసి గతంలో చెప్పారని... ఇకపై కూడా చెప్తారని వివరించారు.
తమకు ఎందుకు ఎన్నుకోవాలో చంద్రబాబు కానీ, ఆయనకు సపోర్ట్ చేస్తున్న వాళ్లు కానీ చెప్పలేకపోతున్నారని అన్నారు సజ్జల. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి అన్ని అమలు చేస్తున్నందునే వాళ్లకు రాక్షస పాలనలా కనిపించవచ్చని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ 2014లో ఇచ్చిన హామీల్లో ఏమైనా అమలు చేశారో చెప్పాలన్నారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్ చేసిన ఆరోపణలనే పట్టుకొని చంద్రబాబుపై పవన్ విమర్శలు చేశారన్నారు.
ఎన్నికల సమయానికి జనాలను భ్రమల్లో పెడితే సరిపోతుందనే ఆలోచనతో చంద్రబాబు పని చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ ఎన్నికలు అయిపోగానే అన్నింటినీ చుట్టేసి పక్కన పెట్టేయొచ్చు... ప్రజలకు షార్ట్ మెమోరీ ఉంటుందని అనుకుంటున్నారని అన్నారు. మళ్లీ ఎన్నికల టైంలో అనౌన్స్ చేస్తే చాలు...జనం నమ్ముతారనే అనుకుంటున్నారన్నారు. ఈసారి అది చెల్లదనే పవన్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు.
పవన్ కల్యాణ్ కూడా రెండు రోజుల నుంచి ఏవోవే హామీలు ఇస్తున్నారని... కానీ వాటికి బేస్ ఏంటని ప్రశ్నించారు సజ్జల. ముందు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పకుండా హామీలు అమలు చేస్తామనే మాట ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వస్తున్న ప్రయోజనం వేరని చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యమన్నారు.
పొత్తులపై మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కల్యాణ్... అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. దీనిపై స్పష్టత వస్తే ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటారన్నారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబా, లోకేషా, పవన్ కల్యాణా అని ప్రశ్నించారు. ఓట్లు చీలకపోవడం అనేది చాలా విచిత్రంగా ఉందన్నారు. అదే కదా పవర్‌లోకి ఎవరు వస్తారో డిసైడ్ చేసేది అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనే సీఎం అభ్యర్థని... ఆయన ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారని... అదే ధీమాతో ఎన్నికల్లో ప్రజలకు ఓట్లు అడుగుతారన్నారు.
చంద్రబాబును ఎందుకు గెలిపించాలో ముందుగా చెప్పిన తర్వాత ప్రజలకు ఓట్లు అడగాలన్నారు సజ్జల. వీళ్లు రాకుంటే రాష్ట్ర నాశనమైపోతుంది... ప్రజలంతా వీళ్ల కోసమే వెయిట్ చేస్తున్నారనే భ్రమలో ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి సహా చాలా మంది వాళ్లను వాళ్లు ప్రూవ్ చేసుకొని.. మా విధానం ఇదీ అని చెప్పి ఎన్నుకోమని ప్రజలను రిక్వస్ట్ చేశారు. అలా చేస్తేనే ప్రజలు హర్షిస్తారన్నారు. అలా కాకుండా నేను ఎలాగో ఉంటాను మీకు మాత్రం మాటిస్తున్నానంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారన్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రిమోట్ చంద్రబాబు వద్ద ఉందన్నారు. ఆయన కంట్రోల్‌లోనే పవన్ నడుస్తారన్నారు. రేపు ఎన్నికల్లో అదే జరుగుతుందన్నారు. ఆయన లక్ష్యం చంద్రబాబును సీఎంగా చేయడమే అన్నారు. అదే విషయాన్ని ప్రజలకు నేరుగా చెప్పేస్తే మంచిదన్నారు. చంద్రబాబు రావడం చారిత్రక అవసరం అని చెప్తే ప్రజలు తమ నిర్ణయాన్ని చెబుతారన్నారు.
17లో జగన్ మోహన్ రెడ్డి యాత్ర సందర్భంగా కూడా రెండు రోజులు ముందు అనుమతి ఇచ్చారని... ఆ రోజు కూడా ఆంక్షలు పెట్టారన్నారు. ఆ రోజుకు ఈరోజుకు ఒక రూల్ మాత్రమే మారిందన్నారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ సభలు పెట్టవద్దని రూల్ కొత్తగా వచ్చిందన్నారు. లోకేష్ యాత్రకు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు సజ్జల. అప్పట్లో ప్రతిపక్ష నేతగా సుమారు 50 శాతం ఓట్లు ఉన్న నేతగా ప్రజలు రమ్మంటే పాదయాత్ర చేశారని... కానీ ఎలాంటి పదవి, ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తి పాదయాత్రకు ఇంత హడావుడి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్ని చేసుకున్నా వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాభిమానం చెక్కుచెదరబోదన్నారు.