New Movies In OTT: కొత్త సినిమా OTTలో ఎప్పుడు రిలీజైతే సేఫ్? డిసైడ్ చేసిన ఫిలిం ఛాంబర్ ప్రముఖులు
Film Chamber Meet: ఏపీలో సినిమా ఇండస్ట్రీ పరిస్దితి ఆగమ్యగోచరంగా మారిందని ఈ సందర్బంగా తెలుగు ఫిల్మ్ చాంబర్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశం విజయవాడ లో జరిగింది. ఓటీటీ ప్లాట్ ఫారంలో విడుదలవుతున్న సినిమాల సమయాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఏపీలోని 13జిల్లాల నుండి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రధానంగా ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సమావేశాన్నినిర్వహించారు. కొత్త సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలంటే, 8వారాలు ఆగాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. చిన్న చిత్రాలకు 4 వారాలు గడవు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చిత్ర పరిశ్రమ పెద్దలు హైదరాబాద్ లో సమావేశం నిర్వహించిన అనంతరం పూర్తి స్దాయిలో క్లారిటి వస్తుందని స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రమేష్, ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్. రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఓటీటీ వల్ల థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గి యాజమాన్యాలు నష్టపోతున్నాయని తెలిపారు. సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు పెద్ద చిత్రాలు 4 వారాలకు చిన్న చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉన్న థియేటర్ వ్యవస్థను ఇండస్ట్రీ పెద్దలే కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.
హిందీ లో నిర్మాతలే డిజిటల్ ఖర్చులు భరిస్తారని వారు వివరించారు. తమిళనాడులో డిజిటల్ ఖర్చు నాలుగు వేలు మాత్రమేనని, కానీ ఇక్కడ 12,500 వరకు ఉందన్నారు. దీనిని తగ్గించడంతోపాటు నిర్మాతలే భరించే విధంగా తీర్మానం చేశామన్నారు. రెంటల్ విధానం కూడా మార్పు చేయాలని నిర్మాతలను కోరామని వారు చెప్పారు.
ప్రభుత్వంతో మాకు పని లేదు.
ఏపీలో సినిమా ఇండస్ట్రీ పరిస్దితి ఆగమ్యగోచరంగా మారిందని ఈ సందర్బంగా తెలుగు ఫిల్మ్ చాంబర్ సభ్యులు అభిప్రాయపడ్డారు. మా వ్యాపారం మేము చేసుకుంటామంటే, ప్రభుత్వం మా వ్యాపారాన్ని నిర్వహిస్తామనటంలో అర్దం లేదని మండిపడుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఇండస్ట్రీ పరిస్దితి ఎటు వెళుతుందో అర్థం కాని స్దితిలో ఉందని తెలిపారు. ఇకపై న్యాయస్థానం ద్వారాను తమ కార్యకలాపాలు ఉంటామయని స్పష్టంచేశారు. టిక్కెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోర్టులో పెండింగ్ లో ఉండటం వలన, ఆ తీర్పు వచ్చిన తరువాతనే ప్రభుత్వం తమతో చర్చలు ఉంటాయని తెలిపిందని ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్. రామ్ ప్రసాద్ వెల్లడించారు.
ప్రభుత్వం టిక్కెట్లు అమ్మి ఆ డబ్బులను మాకు జమచేస్తామనటంలో అర్దం లేదని అన్నారు. అంతే కాదు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బులు తమకు తిరిగి జమ అవుతాయనే నమ్మకం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. థియేటర్లను కాపాడుకోవటానికి, మనుగడను నిలపుకోవటానికి ఇండస్ట్రీలోని పెద్దలంతా సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.