AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
AP Elections 2024: ఈ రెండు పోస్టుల్లో ఉన్న అధికారులను ఈసీ బదిలీ చేసింది. తాజాగా కొత్తగా నియమించిన అధికారులు ఏప్రిల్ 25 ఉదయం 11 గంటల లోపు బాధ్యతల్లో చేరాలని ఈసీ ఆదేశించింది.
AP News Latest: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ పోస్టుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వారిని నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామక్రిష్ణలను నియమిస్తూ బుధవారం (ఏప్రిల్ 24) ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏప్రిల్ 25 ఉదయం 11 గంటలకల్లా ఈ బాధ్యతలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెండు స్థానాల్లో ఇంతకుముందు వరకు ఉన్న అధికారులు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై సీఈసీ ట్రాన్స్ ఫర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు విజయవాడ సీపీగా కాంతి రాణా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. వారు అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా ఈ ఇద్దరు ఉన్నతాధికారులు పని చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాయి.
దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా విచారణ జరిపి.. నివేదికను సీఈసీకి అందించారు. ఆ నివేదిక ప్రకారం.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం మంగళవారం (ఏప్రిల్ 23) ట్రాన్స్ ఫర్ వేటు వేసింది. తక్షణమే వీరు విధుల నుంచి తప్పుకోవాలని.. ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికలకు సంబంధించిన విధులు ఏమీ అప్పగించొద్దని ఆదేశించింది. ఈ ఇద్దరు అధికారుల స్థానాల్లోనే తాజాగా వేరే అధికారులను నియమించింది.
ఈ రెండు పోస్టుల్లో అధికారులను నియమించేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఐపీఎస్ అధికారుల పేర్లను ఎన్నికల సంఘం కోరింది. బుధవారం (ఏప్రిల్ 24) మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు కోసం అడిషనల్ డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల పేర్లే పంపాలని నిర్దేశించింది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలించిన తర్వాత ఈసీ విశ్వజీత్ ను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.